కొత్త పింఛన్లకు అర్హుల జాబితా సిద్ధం చేయాలి

తెలంగాణలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు.

Published : 09 Jul 2024 03:17 IST

అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త సామాజిక పింఛన్ల మంజూరు కోసం అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి, తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అందిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని ప్రభుత్వం పెంచనుందన్నారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) కార్యకలాపాలపై సచివాలయంలో మంత్రి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘వివిధ పథకాలకు గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్లను ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులను సరిగా వాడుకోలేకపోయాం. మా ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. అభయ హస్తం వంటి పథకాలను అమలు చేయకుండా రూ.వందల కోట్ల మహిళల పొదుపు సొమ్మును గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఆ నిధుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలి. బడ్జెట్‌లో మహిళా శక్తికి అవసరమైన నిధులు కేటాయిస్తాం’’ అని సీతక్క తెలిపారు.

అంగన్‌వాడీలకు నాసిరకం సరకులిస్తే చర్యలు 

అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం సరకులు సరఫరా చేసే గుత్తేదారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హెచ్చరించారు. నాణ్యత లేని గుడ్లు, ఇతర వస్తువులు సరఫరా అయితే.. వాటిని ఆయా కేంద్రాల నిర్వాహకులు తిరస్కరించాలని స్పష్టం చేశారు. సరకుల నాణ్యతను తనిఖీ చేసేందుకు జిల్లాల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోమవారం శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతివెస్లీతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘అంగన్‌వాడీ కేంద్రాలకు సరకులు సరఫరా చేసేందుకు గుత్తేదారులతో చేసుకున్న ఒప్పందాలను రెండేళ్లకు పొడిగించడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒప్పందాల కాలాన్ని తగ్గించేందుకు యోచిస్తున్నాం. కేంద్రాల్లో అందిస్తున్న భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి’’ అని మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని