‘డిప్యుటేషన్‌’ ఉద్యోగుల్లో గుబులు

బదిలీల జాబితాల తయారీలో డిప్యుటేషన్‌లో ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్న కేంద్రంతోపాటు వారి కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Published : 09 Jul 2024 03:18 IST

సొంత పోస్టింగు వివరాలే తీసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకునికి వినతి 

ఈనాడు, హైదరాబాద్‌: బదిలీల జాబితాల తయారీలో డిప్యుటేషన్‌లో ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్న కేంద్రంతోపాటు వారి కాలాన్ని కూడా నమోదు చేయడంతో ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవ పోస్టింగు ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖలో ప్రస్తుతం బదిలీలకు అర్హులైన... మండల విస్తరణాధికారులు, మండల, ఆ పైస్థాయి అధికారులతోపాటు మినిస్టీరియల్‌ సిబ్బంది జాబితాను జిల్లాల స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ శాఖలో రెండు వందల మందికిపైగా అధికారులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాల్లో వేర్వేరు శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిన ఉద్యోగుల స్థానాల్లోకి కొందరిని డిప్యుటేషన్‌పై పంపిస్తారు. సెలవుల్లో వెళ్లిన ఉద్యోగులు తిరిగొస్తే... డిప్యుటేషన్‌పై ఉన్న వారిని సొంత పోస్టులోకి/కేంద్రానికి పంపిస్తారు. తాజా బదిలీల జాబితాలో డిప్యుటేషన్‌లో పనిచేస్తున్న వారిని కూడా చేర్చారు. ఇందులో నాలుగేళ్లు దాటిన, అంతకంటే తక్కువ కాలం డిప్యుటేషన్‌లో ఉన్న వారూ ఉన్నారు. విషయం తెలిసి వారంతా ఆయా జిల్లాల వ్యవసాయ శాఖాధికారుల వద్దకు వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు నాలుగేళ్ల సర్వీసు లేకున్నా బదిలీల జాబితాలో చేర్చడంతో సొంత పోస్టింగ్‌ స్థలాన్ని కోల్పోతామని, డిప్యుటేషన్‌ తాత్కాలికమే అయినందున పదోన్నతుల్లోనూ అన్యాయం జరుగుతుందని, డిప్యుటేషన్‌ రద్దయితే మళ్లీ తమకు వెనక్కి వెళ్లే అవకాశమూ ఉండదని వాపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము జాబితాను రూపొందించామని జిల్లాల వ్యవసాయాధికారులు చేతులెత్తేయడంతో పలువురు బాధితులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చి వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపిని కలిశారు. తమ డిప్యుటేషన్‌ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోవద్దని, సొంత పోస్టింగు కేంద్రాన్నే జాబితాలో నమోదు చేసి, తమ బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై గోపి మాట్లాడుతూ... సీనియారిటీ జాబితాల పరిశీలన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. 

పురపాలక శాఖలోనూ బదిలీలు చేయాలి

సాధారణ బదిలీల్లో భాగంగా పురపాలక శాఖ పరిధిలో ఏళ్ల తరబడి వివిధ విభాగాల్లో పని చేస్తున్న అధికారులనూ బదిలీ చేయాలని మున్సిపల్‌ కౌన్సిల్‌ ఫోరం అధ్యక్షుడు భూక్యా రామునాయక్‌ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. పురపాలక శాఖ, డీటీసీపీ, ప్రజారోగ్య, హెచ్‌ఎండీఏ, రెరా తదితర విభాగాల అధికారులను బదిలీ చేయాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని