రెవెన్యూలో బదిలీలకు మార్గదర్శకాలు

రెవెన్యూ శాఖలోని ఉప తహసీల్దార్లు, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్ల బదిలీల మార్గదర్శకాలను సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ సోమవారం జారీచేశారు. జిల్లాల పరిధిలో (ఆరో జోన్‌ మినహా) బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారిని కలెక్టర్లు పూర్తి చేయవచ్చు.

Published : 09 Jul 2024 03:19 IST

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ట్రెసా ప్రతినిధులు

ఈనాడు, హైదరాబాద్‌: రెవెన్యూ శాఖలోని ఉప తహసీల్దార్లు, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్ల బదిలీల మార్గదర్శకాలను సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌ సోమవారం జారీచేశారు. జిల్లాల పరిధిలో (ఆరో జోన్‌ మినహా) బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారిని కలెక్టర్లు పూర్తి చేయవచ్చు. బదిలీ ప్రతిపాదనలను జోనల్‌ కమిటీకి పంపించాలి. జిల్లాల బయటి ప్రాంతాలకు బదిలీ కోరుతున్న వారికి సంబంధించిన ప్రతిపాదనలను, ఆరో జోన్‌ (చార్మినార్‌) పరిధిలోని అన్ని రకాల బదిలీల ప్రతిపాదనలను సీసీఎల్‌ఏకు అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. 

 ఉప తహసీల్దార్లు, సీనియర్‌ అసిస్టెంట్లకు జిల్లాస్థాయిలోనే బదిలీలు చేపట్టాలని, ఇతర జిల్లాలకు బదిలీ కోరుకుంటే ఐచ్ఛికాల ద్వారా పూర్తి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ట్రెసా కోరింది. సోమవారం సచివాలయంలో ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌ మంత్రిని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్‌కు కూడా వినతిపత్రాన్ని సమర్పించారు. 

నిబంధనలు పాటించండి: దామోదర్‌ రాజనర్సింహ 

రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో ఏఎన్‌ఎంల నుంచి ప్రొఫెసర్ల వరకు అన్ని స్థాయుల్లో జరిగే బదిలీల్లో నిబంధనలను పాటించాలని మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన... తన శాఖలోని ఉన్నతాధికారులు క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, ప్రశాంతి, ఆర్‌.వి.కర్ణన్, ఎన్‌.వాణి, రవీందర్‌ నాయక్, అజయ్‌కుమార్, శివలీల తదితరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బదిలీల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని స్పష్టంచేశారు. 

మంత్రి ఉత్తమ్‌కు ఇంజినీర్ల వినతి 

నీటిపారుదల శాఖలో సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన సహాయ కార్య నిర్వాహక ఇంజినీర్ల(ఏఈఈ) బదిలీలు చేపట్టాలని ఇంజినీర్లు సోమవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. హైదరాబాద్‌ జలసౌధలో తనను వారు కలిసిన వెంటనే స్పందించిన మంత్రి... ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. త్వరలో చేపట్టనున్న ఇంజినీర్ల భర్తీ పూర్తికాగానే బదిలీలు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 

బదిలీ ఉపాధ్యాయుల రిలీవ్‌కు చర్యలు 

రాష్ట్రంలో ఇటీవల బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్‌ చేస్తామని, వ్యక్తిగత సమస్యలపై వచ్చిన న్యాయమైన అప్పీళ్లను పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. సచివాలయంలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ), జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆఫ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(జాక్టో) నాయకులు జంగయ్య, జి.సదానందంగౌడ్, అశోక్‌కుమార్, లింగారెడ్డి, రాధాకృష్ణ, పోచయ్య, సీహెచ్‌.శ్రీనివాస్, కొండయ్య, గీతాంజలి, చావ రవి, నాగిరెడ్డి, సోమయ్య, గౌరీశంకర్‌ తదితరులతో సమావేశమయ్యారు. సాంకేతిక సమస్యలు, అవగాహనా లోపంతో ఆప్షన్లను పొరపాటుగా ఇచ్చి, నష్టపోయిన ఉపాధ్యాయుల అప్పీళ్లపై సానుకూలంగా పరిష్కరించాలని వారు విన్నవించారు. పదోన్నతుల తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు రెండోవిడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, 1, 2 మల్టీ జోన్లలో ఉన్నత పాఠశాలల గెజిటెడ్‌ హెచ్‌ఎంలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని