తగ్గిన పన్ను ఆదాయం

రాష్ట్రానికి వచ్చే విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా మద్యంపై వచ్చే పన్ను బాగా తగ్గింది. మే నెలలో మద్యంపై రూ.1,518 కోట్లు కాగా అది జూన్‌లో రూ.1,342 కోట్లకు పడిపోయింది.

Published : 09 Jul 2024 03:23 IST

మే నెల కన్నా జూన్‌లో మందగించిన మద్యం విక్రయాలు

రాష్ట్రానికి వచ్చే విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ప్రధానంగా మద్యంపై వచ్చే పన్ను బాగా తగ్గింది. మే నెలలో మద్యంపై రూ.1,518 కోట్లు కాగా అది జూన్‌లో రూ.1,342 కోట్లకు పడిపోయింది. ఎన్నికలయ్యాక జూన్‌లో మద్యం అమ్మకాలు, దానిపై వ్యాట్‌ వసూళ్లు తగ్గాయి.  మరోవైపు పెట్రోలు అమ్మకాలపై వ్యాట్‌ వసూళ్లు మేలో రూ.1,278 కోట్లు కాగా.. జూన్‌లో రూ.1,387 కోట్లకు చేరాయి. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమవ్వడంతో వాహన వినియోగం అధికమై ఆదాయం పెరిగింది.  వ్యాట్, జీఎస్టీ, వృత్తిపన్ను కలిపి జూన్‌లో రూ.7,075 కోట్లు రాబట్టాలని  ప్రభుత్వం లక్ష్యాన్ని విధించగా రూ.6,150 కోట్లు వచ్చింది. 2023 జూన్‌లో జీఎస్టీ ఒక్కటే రూ.3,183 కోట్లు రాగా ఈఏడాది జూన్‌లో రూ.3,352 కోట్లు వచ్చింది. జీఎస్టీ రూ.3,963 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినా లక్ష్యం నెరవేరలేదు.ఇనుము, స్టీల్, ఆటోమొబైల్‌ అమ్మకాలూ పడిపోవడంతో వాటిపై జీఎస్టీ తగ్గింది. ఐటీ, కంప్యూటర్లు, బ్యాంకింగ్‌పై అధికంగా జీఎస్టీ వచ్చింది.  

జీఎస్టీ పెరిగిన రంగాలివీ..

అత్యధిక జీఎస్టీ వసూలయ్యే వాటిలో 3వ స్థానంలో ఉన్న డ్రగ్స్, ఫార్మాపై జీఎస్టీ రూ.90.9 కోట్ల నుంచి రూ.109.3 కోట్లకు, ఎలక్ట్రానిక్స్‌పై రూ.63.91 కోట్ల నుంచి 92.49 కోట్లకు ఆదాయం పెరిగింది. ఐటీ, కంప్యూటర్ల రంగం నుంచి జీఎస్టీ వసూలు రూ.38.39 కోట్ల నుంచి రూ.53.87 కోట్లకు చేరింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలపైనా రూ.33.66 కోట్ల నుంచి రూ.59.49 కోట్లకు ఎగబాకింది.

తగ్గిన రంగాలివీ..

2023 జూన్‌లో ఆటోమొబైల్స్, విడిభాగాలపై రూ.363.78 కోట్ల జీఎస్టీ రాగా ఈ ఏడాది అదే నెలలో రూ.340.67 కోట్లకు తగ్గింది. ఇనుము, స్టీలుపై రూ.162.52 కోట్ల నుంచి రూ.138.94 కోట్లకు.. ఎల్‌పీజీ, లూబ్రికెంట్స్‌పై రూ.54.41 కోట్ల నుంచి రూ.49.29 కోట్లకు తగ్గింది. రెడీమేడ్‌ దుస్తుల అమ్మకాల జీఎస్టీ రూ.44.38 కోట్ల నుంచి రూ.31.83 కోట్లకు క్షీణించింది. మొబైల్‌ ఫోన్ల అమ్మకాలపై జీఎస్టీ రూ.42.55 కోట్ల నుంచి 31.15 కోట్లకు పడిపోయింది. సిమెంటుపై రూ.37.08 కోట్ల నుంచి 30.98 కోట్లకు దిగజారింది. సేవల రంగంలో ‘వర్క్స్‌ కాంట్రాక్ట్స్‌’పై 2023 జూన్‌లో రూ.91.25 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.79.26 కోట్లు.. టెలి కమ్యూనికేషన్స్‌ సేవల్లో రూ.39.15 కోట్ల నుంచి 29.6 కోట్లకు తగ్గింది. 

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని