ధరణిలో వారసత్వ గందరగోళం

ధరణి పోర్టల్లో ఏకకాల రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌తో వారసత్వ హక్కులకు నష్టం వాటిల్లుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

Published : 09 Jul 2024 03:24 IST

కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో పరిశీలన చేయాలంటున్న నిపుణులు

ధరణి పోర్టల్లో ఏకకాల రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌తో వారసత్వ హక్కులకు నష్టం వాటిల్లుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  వారసుల అంగీకారమేదీ లేకుండానే లావాదేవీ పూర్తవుతోందని బాధితులంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి విచారణ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

కుటుంబ సభ్యుల నిర్ధారణ లేకుండానే 

ధరణి పోర్టల్లో కోర్‌ బ్యాంకింగ్‌ విధానంలో నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్‌-మ్యుటేషన్‌ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతోంది. భూమిని కొనుగోలు చేసే వ్యక్తి మీ సేవా కేంద్రంలో స్లాట్‌ నమోదు చేసుకుని సమయం కేటాయింపు కాగానే తహసీల్దారు-సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి హాజరవుతారు. ఆ వెంటనే క్రయ విక్రయదారుల ఆధార్‌లను పరిశీలించి వారి పాసుపుస్తకాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈ లావాదేవీకి సంబంధించి ఆ భూమి ప్రభుత్వానికి చెందినదా లేదా, కోర్టు కేసులు ఉన్నాయా లేవా అని రెవెన్యూ సిబ్బంది పరిశీలిస్తారు. ఈ సమయంలో వారసత్వ సమస్యలను తప్పనిసరిగా పరిశీలించాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు. భూ విక్రయ విషయం తెలిసి వారసులు      ముందుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తేనే ప్రక్రియను నిలిపేస్తున్నారు. అయితే, స్లాట్‌ నమోదైతే ధరణి చట్టం ప్రకారం లావాదేవీని నిలిపివేసే అధికారం కలెక్టర్‌కు తప్ప క్షేత్రస్థాయి అధికారులకు లేదు. ఈ విధానమే వివాదాలకు దారితీస్తోంది. 

పాత చట్టంలో స్పష్టత 

ఆర్వోఆర్‌-1971 చట్టంలో యాజమాన్య హక్కులకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. 2020 అక్టోబరులో ఈ చట్టానికి ప్రభుత్వం సవరణ తెచ్చింది. అంతకు ముందు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేది. ఆ తరువాతే తహసీల్దారు వద్ద మ్యుటేషన్‌ జరిగేది. దీనిలో భాగంగా పది రోజుల వ్యవధిలో గ్రామంలో నోటీసు జారీ చేసి, విచారణ చేపట్టేవారు. ఆ తరువాత రెవెన్యూ మాతృ దస్త్రంలో (1 బి) మార్పులు జరిగేవి. జాప్యంతోపాటు అవినీతి జరుగుతోందనే కారణంతో గత ప్రభుత్వం విచారణను తొలగించింది. ఒక దశలో పట్టాదారు పాస్‌ పుస్తకాల్లోనే కుటుంబ సభ్యుల వివరాలను కూడా పొందుపరిచేందుకు ప్రయత్నాలు చేసింది.

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని