సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను దామాషా ప్రకారం పెంచాలన్న డిమాండ్‌తో ఈనెల 14 నుంచి 31 వరకు యాత్ర చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

Updated : 10 Jul 2024 03:30 IST

14 నుంచి సమగ్ర కులగణన యాత్ర
జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లను దామాషా ప్రకారం పెంచాలన్న డిమాండ్‌తో ఈనెల 14 నుంచి 31 వరకు యాత్ర చేపడుతున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌ చేశారని, అందుకే తమ యాత్రను అక్కడి నుంచే ప్రారంభిస్తామని ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ... ఈ యాత్ర నిర్వహించాలని 136 కులాలు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వివరించారు. రిజర్వేషన్‌ వ్యతిరేకులు చట్టంలోని లొసుగులను చూపుతూ అడ్డుకునే ప్రమాదం ఉందని అందుకే కుల గణన చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు బాలగోని బాల్‌రాజ్‌గౌడ్, కుందారం గణేశాచారి, తాటికొండ విక్రమ్‌గౌడ్, నగేష్‌గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, భాస్కర్, సమతా యాదవ్, సంధ్య, శ్యామల తదితరులు పాల్గొన్నారు.


విద్యార్థులు, నిరుద్యోగులతో చర్చలు జరపండి: ఆర్‌.కృష్ణయ్య

సచివాలయం ముట్టడి గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్, ఆర్‌.కృష్ణయ్య తదితరులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: విద్యార్థులు, నిరుద్యోగులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగులకు మద్దతుగా విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు, నిరుద్యోగులు అడుగుతున్నవన్నీ న్యాయమైనవేనని, వాటిని పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. జులై 15న తలపెట్టిన సచివాలయం ముట్టడిని విజయవంతం చేయాలని కుల, ప్రజా, విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. మరో అతిథి, భారాస నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ..ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.  టెట్‌ ఫలితాల తర్వాత వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మేధావుల కమిటీ, చర్చల పేరుతో నిరుద్యోగుల పోరాటాన్ని నీరుగార్చే కుట్ర జరుగుతోందని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్‌ ఆరోపించారు. సమాఖ్య అధ్యక్షుడు కొంపెల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.


శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల అప్పగింతపై విచారణ ఆగస్టు 20కి వాయిదా 

ఈనాడు, దిల్లీ: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి అనుమతి లేకుండానే విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నీటిని వినియోగిస్తున్నందున ఆ రెండు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ ఆగస్టు 20కి వాయిదా పడింది. ఇదివరకు ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన ఈ కేసును మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిపిన జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకోవడానికి సమయం కావాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోరగా ధర్మాసనం అంగీకరించింది. 


బాధ్యతలు చేపట్టిన సుదర్శన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అంశాన్ని అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం వర్తమానం పంపారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్‌రాజ్‌ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించి ఆయన్ను ఎన్నికల బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆ మేరకు సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు.


ద.మ.రైల్వే సీపీఆర్వోగా శ్రీధర్‌
డిప్యూటీ చీఫ్‌ విజిలెన్స్‌కు రాకేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ద.మ.రైల్వే నూతన సీపీఆర్వోగా ఎ.శ్రీధర్‌ మంగళవారమిక్కడ రైల్‌ నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌ (ఐఆర్‌టీఎస్‌) 2011 బ్యాచ్‌కి చెందిన శ్రీధర్‌ గతంలో హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లలో సీనియర్‌ డివిజనల్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఇంతకుముందు సీపీఆర్వోగా విధులు నిర్వర్తించిన సీహెచ్‌ రాకేశ్‌ జోన్‌ డిప్యూటీ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ (ట్రాఫిక్, ఆర్పీఎఫ్‌)గా బదిలీ అయ్యారు. 


గ్రూప్‌-4 ‘అర్హులకు’ ధ్రువపత్రాల పరిశీలన

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-4లో ప్రతిభ కనబరిచిన.. వినికిడి లోపం ఉన్న అభ్యర్థులు.. ఈ నెల 11 నుంచి సెప్టెంబరు 4 వరకు హైదరాబాద్‌ కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మెడికల్‌ బోర్డు ఎదుట హాజరై ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీజీపీఎస్సీ) తెలిపింది. గ్రూపు-4 హాల్‌టికెట్, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, పాత ధ్రువపత్రాలను తీసుకురావాలని, పూర్తి వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. 


పంచాయతీరాజ్‌ శాఖలో కమిటీలు 
బదిలీ దరఖాస్తులను పరిశీలించి సిఫార్సులు  

ఈనాడు, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారి పేర్లను, స్థానాలను సూచించి, బదిలీలు చేసేందుకుగాను కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్‌ పోస్టులైన అదనపు, ఉప కమిషనర్లు, జడ్పీ సీఈవోలు, డీసీఈవోలు, అకౌంట్స్‌ అధికారి, జిల్లా పంచాయతీ అధికారులు, జేడీలు, డీడీల బదిలీ దరఖాస్తుల పరిశీలనకు పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి, కమిషనర్, అదనపు కార్యదర్శితో ఒక కమిటీ ఏర్పాటైంది. మల్టీజోనల్‌ పోస్టులైన ఎంపీడీవోలు, డివిజనల్, మండల పంచాయతీ అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జోనల్‌ పోస్టులైన ఏవోలు, పంచాయతీ కార్యదర్శుల బదిలీల దరఖాస్తుల పరిశీలనకు కమిషనర్, అదనపు కార్యదర్శి, ఉప కమిషనర్‌లతో కూడిన కమిటీ ఏర్పాటైంది. జిల్లా కలెక్టర్‌ పోస్టులకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీపీవోలతో కూడిన కమిటీ ఏర్పాటైంది.


మళ్లీ డీఈఈసెట్‌కు పెరిగిన డిమాండ్‌
నేటి పరీక్షకు హాజరుకానున్న 17,965 మంది
 

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించనున్న డీఈఈసెట్‌కు మళ్లీ డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది కేవలం 8 వేల మంది దరఖాస్తు చేయగా.. ఈసారి రెట్టింపు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 39 పరీక్ష కేంద్రాల్లో జరిగే డీఈఈసెట్‌కు 17,965 మంది హాజరుకానున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్‌ టీచర్లు(ఎస్‌జీటీ) పోస్టులకు కేవలం డీఈడీ చదివిన వారే అర్హులని, బీఈడీ విద్యార్హతలున్న వారు అనర్హులని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోటీ పెరిగిందని కన్వీనర్‌ శ్రీనివాసాచారి అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తెచ్చుకోవాలని ఆయన సూచించారు.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తుకు సీనియర్‌ రెసిడెంట్‌లకు అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు 2023 బ్యాచ్‌ సీనియర్‌ రెసిడెంట్‌లకు అనుమతి ఇస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు ఐదో తేదీకి ఏడాది సీనియర్‌ రెసిడెన్సీ ప్రోగ్రాం పూర్తి చేసుకోనున్న సీనియర్‌ రెసిడెంట్‌లకు తాజా నోటిఫికేషన్‌ ఇచ్చిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖను కోరారు. ఈ నేపథ్యంలో డీఎంఈ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సిఫారసు మేరకు ఒకసారి అవకాశంగా పేర్కొంటూ దరఖాస్తుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, కార్యదర్శి, డీఎంఈకి సీనియర్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని