ఒక ప్రాంగణం... రెండు హైస్కూళ్లు

రాష్ట్రంలో చాలా ఉన్నత పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థులుంటే ఉపాధ్యాయులు లేరు. మరికొన్నిచోట్ల టీచర్లుంటే విద్యార్థులు లేరు.

Published : 10 Jul 2024 03:12 IST

రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇదే దుస్థితి
విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎన్నో

ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 450. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో మొత్తం తొమ్మిది సెక్షన్లు పనిచేస్తుండగా ఏడుగురు ఉపాధ్యాయులు, ఒక పీడీ మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం మరో అయిదుగురు ఉపాధ్యాయులు అవసరం.


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చాలా ఉన్నత పాఠశాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి దారుణంగా ఉంది. కొన్నిచోట్ల విద్యార్థులుంటే ఉపాధ్యాయులు లేరు. మరికొన్నిచోట్ల టీచర్లుంటే విద్యార్థులు లేరు. సరిపడా పిల్లలు లేకున్నా... ఒకే గ్రామంలో రెండు ఉన్నత పాఠశాలలు వందల చోట్ల కొనసాగుతున్నాయి. ఇవికాకుండా 25చోట్ల ఒకే ప్రాంగణంలో రెండు హైస్కూళ్లు ఉన్నాయి. నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, హనుమకొండ, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, ములుగు, నారాయణపేట తదితర జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. వీటిలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం బడులుంటే రెండింటినీ విలీనం చేయొచ్చని, ఉర్దూ పాఠశాలలను పక్కనబెట్టినా విలీనం చేయాల్సిన పాఠశాలలు 20 వరకు ఉంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక పిల్లల సంఖ్యతో సమానంగా ఉపాధ్యాయులు ఉన్నవి పదుల సంఖ్యలో పనిచేస్తున్నాయి. ఉదాహరణకు తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో 13 మంది విద్యార్థులకు ఆరుగురు టీచర్లు, కరివిరాలలో 22 మందికి ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఒక్క విద్యార్థి కూడా లేని ఉన్నత పాఠశాలలు 34 ఉన్నా అవి కూడా పనిచేస్తున్నాయి. అక్కడి ఉపాధ్యాయులను వేరేచోట్లకు డిప్యుటేషన్‌పై పంపుతున్నారు. 

హైదరాబాద్‌ శివార్లలో కిక్కిరిసిన పాఠశాలలు 

రాష్ట్రంలో 4,700 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 200 మంది విద్యార్థులకు మించి ఉన్నవి 1381 వరకు ఉంటాయి. ఇలా ఆదరణ ఉన్నా తగినంత మంది ఉపాధ్యాయులను నియమించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌ శివారు మండలాల్లోని హైస్కూళ్లు కిక్కిరిసిపోతున్నాయి. పటాన్‌చెరు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి తదితర మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉపాధ్యాయుల కొరత కారణంగా కొన్నిచోట్ల విద్యార్థులను చేర్చుకోలేని పరిస్థితి ఉందని హెచ్‌ఎంలు వాపోతున్నారు. ‘ఒకే ప్రాంగణంలో... ఒకే గ్రామంలో రెండు ఉన్నత పాఠశాలలు ఉంటే వాటిని విలీనం చేయాలి. అక్కడ ఉపాధ్యాయులు మిగిలితే అవసరమున్న చోటకు పంపాలి. దానివల్ల నాణ్యమైన విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది’ అని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఇబ్బంది లేని చోట హేతుబద్ధీకరణ చేయాలని తమ సంఘం కోరుతోందన్నారు. 

  • జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ఒక హైస్కూల్‌లో 35 మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు, బాలికల పాఠశాలలో 122 మంది విద్యార్థినులకు... తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 
  • కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌ హైస్కూల్‌లో 86 మంది విద్యార్థులకు 8 మంది, బాలిక పాఠశాలలో 12 మందికి 7గురు ఉపాధ్యాయులున్నారు. 
  • ములుగులోని బాలుర ఉన్నత పాఠశాలలో 81 మంది పిల్లలకు 7గురు ఉపాధ్యాయులు, బాలికల పాఠశాలలో 71 మంది విద్యార్థినులకు 7గురు టీచర్లు ఉండటం గమనార్హం. 
  • సిద్దిపేట జిల్లా కొండపాకలోని బాలుర పాఠశాలలో 134 మందికి 10 మంది ఉపాధ్యాయులు, బాలిక హైస్కూల్‌లో 147 మందికి తొమ్మిది మంది టీచర్లు ఉన్నారు.

ఒకే ప్రాంగణంలో 2 ఉన్నత పాఠశాలలున్న తుంగతుర్తి

ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఉన్నత పాఠశాల. ఇక్కడ ఒకే ప్రాంగణంలో బాలురు, బాలికలకు రెండు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. బాలుర హైస్కూల్‌లో 231 మంది ఉండగా.. 13 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బాలికల పాఠశాలల్లో 18 మంది విద్యార్థినులే ఉండగా 9మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని