దేశంలో 3.5 కోట్ల కేసులు పెండింగ్‌

‘మనిషి తన అహాన్ని పక్కన పెడితే వివాదాలు చాలావరకు తగ్గిపోతాయి’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 10 Jul 2024 03:20 IST

మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌

బషీర్‌బాగ్, న్యూస్‌టుడే: ‘మనిషి తన అహాన్ని పక్కన పెడితే వివాదాలు చాలావరకు తగ్గిపోతాయి’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు తగ్గుముఖం పడతాయన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌... బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ‘ఏడీఆర్‌-2024’ (వివాదాల పరిష్కారాలకు ప్రత్యామ్నాయం)కు స్వాగతం’ పేరిట ‘మధ్యవర్తిత్వ చట్టం-2023- న్యాయస్థానం, న్యాయవాదుల పాత్ర’ అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. కౌన్సిల్‌ ఫర్‌ ఆల్టర్‌నేట్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్స్‌ ట్రస్ట్‌ (సీఏడీఆర్‌టీ) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జస్టిస్‌ భీమపాక నగేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 3.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, రోజుకు 100 చొప్పున పరిష్కరించినా.. 34 ఏళ్లు పడుతుందని గుర్తు చేశారు. దీనిదృష్ట్యా మధ్యవర్తిత్వానికి చొరవ చూపాలని సూచించారు. రాష్ట్ర హైకోర్టు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి.నర్సింహశర్మ మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ల ద్వారా మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ కొంతవరకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. దీంతో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ న్యాయవాదులు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి తోడ్పాటునందించాలని కోరారు. సదస్సుకు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ వైస్‌ ఛైర్మన్‌ సునీల్‌గౌడ్, ‘సీఏడీఆర్‌టీ’ కార్యదర్శి దీపక్‌ భట్టాఛార్జి, ‘ఇక్ఫాయ్‌’ వర్సిటీ సలహాదారుడు ఏవీ నర్సింహారావు, మహిళా ప్రతినిధులు శిల్ప, లలితారెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని