మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించండి: సీఎస్‌

రాష్ట్రంలో రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమాఖ్య సంఘాలకు రుణసాయం అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

Published : 10 Jul 2024 03:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న అయిదేళ్లలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమాఖ్య సంఘాలకు రుణసాయం అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో మహిళాశక్తి క్యాంటీన్‌లను ప్రారంభించాలని, అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, వ్యవసాయ సంబంధిత అంశాలు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై మంగళవారం ఆమె జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘‘వానాకాలం సీజన్‌లో రైతులకు ఎరువుల పంపిణీ సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. వానాకాలంలో అతిసార, డెంగీ, మలేరియా, గన్యా జ్వరాల లాంటి వ్యాధులను అరికట్టాలి. ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్, ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలి. హెల్ప్‌లైన్లు, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేయాలి.

20లోపు బదిలీల ప్రక్రియ పూర్తిచేయండి 

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈనెల 20 లోగా ఎట్టిపరిస్థితిలోనూ పూర్తి చేయాలి. ఇప్పటికే శాఖల వారీగా ఖాళీల వివరాలను ప్రకటించాం. రాష్ట్రంలో దాదాపు 49 సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి పాఠశాలకు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే సేకరించాలి. ఇందిరమ్మ కేంద్ర గ్రాంటు కోసం లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్‌ చేయాలి’’ అని సీఎస్‌ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని