బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో తోపులాట

హైదరాబాద్‌ బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరైన హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిలకు చేదు అనుభవం ఎదురైంది.

Published : 10 Jul 2024 06:12 IST

మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మిలకు చేదు అనుభవం

ఎల్లమ్మ ఆలయంలో తోపులాట జరగడంతో.. లోపలికి వెళ్లలేక పక్కన కూర్చున్న మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి 

ఈనాడు, హైదరాబాద్, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్‌- న్యూస్‌టుడే: హైదరాబాద్‌ బల్కంపేటలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవానికి హాజరైన హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మిలకు చేదు అనుభవం ఎదురైంది. కల్యాణోత్సవ వేదిక వద్దకు ఏర్పాటు చేసిన వీవీఐపీ మార్గంలో ఉదయం 10 గంటలకు మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మి కలిసి వచ్చారు. అంతకుముందే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెంట పోలీసు అధికారులు లోపలికి వెళ్లడంతో..  పొన్నం, మేయర్‌లను ఆహ్వానించేందుకు అక్కడ అధికారులు కనిపించలేదు. పొన్నం ప్రభాకర్, విజయలక్ష్మిలు ఆలయంలోకి వెళ్లే సమయంలో భక్తుల రద్దీతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ సమయంలో ఇద్దరూ కిందపడినంత పనైంది. దీంతో మంత్రి, మేయర్‌లు లోపలికి వెళ్లకుండా అక్కడే కూర్చుండిపోయారు. నగర పోలీసు కమిషనర్‌కు ఫోన్‌ చేసి అసహనం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, ఇతర పోలీసులు నచ్చజెప్పడంతో కల్యాణోత్సవ వేదిక వద్దకు వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ఉన్న మంత్రి సురేఖతో కలిసి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. తర్వాత మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపించిందన్నారు. 

మహిళా టీవీ రిపోర్టర్‌కు అవమానం

కల్యాణోత్సవాన్ని కవర్‌ చేసేందుకు మీడియా ప్రతినిధులకు పాస్‌లు ఉన్నప్పటికీ పోలీసులు వారిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓ టీవీ మహిళా రిపోర్టర్‌ పట్ల విధుల్లో ఉన్న ఎస్సై ఒకరు అవమానకరంగా వ్యవహరించారు. తాను జర్నలిస్టునని, లోనికి అనుమతించాలని అక్కడ విధుల్లో ఉన్న ఎస్సైను ఆమె అభ్యర్థించారు. గర్భిణినని చెప్పినా వినలేదు. గర్భిణి అనేందుకు సాక్ష్యం చూపాలంటూ ఎస్సై అసభ్యంగా వ్యవహరించారంటూ బాధితురాలు మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మిల దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కుట్రకోణంపై నివేదిక కోరిన మంత్రి సురేఖ 

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో జరిగిన ఘటనల్లో కుట్రకోణం ఉందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆలయంలో తొక్కిసలాట, మేయర్‌  విజయలక్ష్మి కింద పడబోవడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు