రహదారుల అత్యవసర మరమ్మతులకు రూ. 52.59 కోట్లు

రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.52.59 కోట్లు విడుదల చేసింది. వర్షాలు ముమ్మరమయ్యేలోగా రాష్ట్రంలో ఇప్పటికే గుర్తించిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.

Published : 10 Jul 2024 03:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రహదారుల అత్యవసర మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.52.59 కోట్లు విడుదల చేసింది. వర్షాలు ముమ్మరమయ్యేలోగా రాష్ట్రంలో ఇప్పటికే గుర్తించిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. రహదారులు భవనాల శాఖలోని 16 సర్కిళ్ల పరిధిలో పనులు చేపట్టే అధికారాన్ని క్షేత్రస్థాయి అధికారులకే అప్పగించింది. రాష్ట్రంలోని రహదారుల స్థితిగతులపై ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గత నెలలో అధికారులను నివేదిక కోరారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన మీదట రెండు దశల్లో మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు మంత్రికి నివేదించారు. 4,417 కిలోమీటర్ల రహదారుల పునరుద్ధరణకు రూ.1,700 కోట్లు, నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.105.17 కోట్లు అవసరమని పేర్కొన్నారు. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టినా దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుతం నిర్వహణ పరమైన పనులు మాత్రమే చేయాలని సూచించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిధులు విడుదల చేసింది. పూర్తిస్థాయిలో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మరో ప్రణాళికను తయారు చేయాల్సిందిగా స్పష్టంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని