నకిలీ విత్తన విక్రయాలు అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి

నకిలీ విత్తనాలను అరికట్టడానికి.. విక్రయదారుల నుంచి రైతులను కాపాడటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 10 Jul 2024 03:17 IST

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
2016లో రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ 

ఈనాడు, హైదరాబాద్‌: నకిలీ విత్తనాలను అరికట్టడానికి.. విక్రయదారుల నుంచి రైతులను కాపాడటానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నకిలీ విత్తనాలతో అన్నదాతలు నష్టపోతున్నారని, వారికి పరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2016లో కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయా కంపెనీలు రైతులకు పరిహారం చెల్లించని పక్షంలో వాటి ఆస్తులను జప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. ఆ కంపెనీల లైసెన్సులను రద్దు చేయడం, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో మహారాష్ట్ర హైబ్రిడ్‌ సీడ్స్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్, కావేరి సీడ్స్‌ కంపెనీ లిమిటెడ్, గంగా కావేరీ సీడ్స్, అంకుర్‌ సీడ్స్, రాశి, మోన్‌శాంటో, శ్రీరాంబయోసీడ్స్, నూజివీడు, జె.కె.అగ్రి జెనెటిక్స్, గ్రీన్‌ ఎరా సీడ్స్, జీవా అగ్రి జెనెటిక్స్‌ తదితర కంపెనీలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై పలుమార్లు విచారణ చేపట్టగా గత మార్చిలో తుది విచారణకు ధర్మాసనం నిర్ణయించింది. అప్పుడు పిటిషనర్‌ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణ వాయిదా పడింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చెప్పడానికి గడువు కావాలని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ఖాన్‌ కోరడంతో ధర్మాసనం అందుకు అనుమతిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేయగా.. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం యాదృచ్ఛికం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని