రూ.400 కోట్లతో మారియట్‌ పెట్టుబడులు

ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ త్వరలో తెలంగాణలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌-జీసీసీ)’ నెలకొల్పనుంది.

Published : 10 Jul 2024 03:17 IST

ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఆతిథ్య రంగంలో ప్రసిద్ధి చెందిన ‘మారియట్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ త్వరలో తెలంగాణలో తమ ‘అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని (గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌-జీసీసీ)’ నెలకొల్పనుంది. రూ.300-400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో మారియట్‌ ఇంటర్నేషనల్‌ త్వరలో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సచివాలయంలో మంగళవారం మారియట్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు.. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దాదాపు రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని, అవి త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయని మంత్రి పేర్కొన్నారు. ‘‘మారియట్‌ సంస్థ తమ జీసీసీని హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించింది. అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో వారు ఎంఓయూ కుదుర్చుకోనున్నారు. దశలవారీగా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ పెట్టుబడులుంటాయి. ప్రాథమిక దశలో 500 సీటింగ్‌ సామర్థ్యమున్న స్థలం కోసం చూస్తున్నారు. ఆ తర్వాత 1000 సీటింగ్‌ సామర్థ్యానికి విస్తరిస్తారు’’ అని శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణ కోసం త్వరలోనే రెండు ఫార్మా దిగ్గజ సంస్థలతో పాటు మరో 8 నుంచి 10 కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, ఇవన్నీ కార్యరూపం దాల్చితే వచ్చే రెండేళ్లలో దాదాపు 20-25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని