కొత్త వైద్య కళాశాలలకు అనుమతిపై పునఃపరిశీలించండి

రాష్ట్రంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులను నిరాకరించడంతో... ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)ను కోరాలని వైద్యవిద్య డైరెక్టరేట్‌(డీఎంఈ) నిర్ణయించింది.

Published : 10 Jul 2024 03:18 IST

ఎన్‌ఎంసీని కోరనున్న వైద్యవిద్య డైరెక్టరేట్‌ అధికారులు
అవసరమైతే మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతులను నిరాకరించడంతో... ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)ను కోరాలని వైద్యవిద్య డైరెక్టరేట్‌(డీఎంఈ) నిర్ణయించింది. మరోసారి దరఖాస్తు చేసేందుకూ కసరత్తు చేస్తోంది. 2024-25 విద్యాసంవత్సరంలో గద్వాల, మెదక్, ములుగు, షాద్‌నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి డీఎంఈ దరఖాస్తు చేసుకుంది. అయితే, అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతిచ్చేందుకు ఎన్‌ఎంసీ నిరాకరించింది. నూతన వైద్య కళాశాలల ప్రారంభం నుంచే అన్ని విభాగాలు, అనుబంధ బోధనాసుపత్రి పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని కమిషన్‌ గతంలోనే స్పష్టంచేసింది. అయితే, నిబంధనల మేరకు బోధనా సిబ్బంది లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై డీఎంఈ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.... ‘‘షాద్‌నగర్, కుత్బుల్లాపూర్‌ మినహా మిగిలిన ఆరింటికి అనుమతులు వస్తాయని భావించాం. భవనాల సమస్య లేకున్నా కొన్నిచోట్ల అనుబంధ ఆసుపత్రులు, సిబ్బందిపై ఎన్‌ఎంసీ అసంతృప్తి వ్యక్తంచేసింది. బోధనా సిబ్బందిని సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతుండగానే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్ల పదోన్నతులు ఇచ్చాం. తాజా బదిలీల్లోనూ కొత్త వైద్య కళాశాలల్లోని పోస్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నాం. తనిఖీల సమయంలో లేని సదుపాయాలను తర్వాత సమకూర్చాం. అందుకే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఎన్‌ఎంసీని కోరుతాం. ఎనిమిదింటిలో కొన్నింటినైనా ఈ ఏడాది ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాం. ఈ నెలాఖరు వరకు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. అన్ని అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని