రైతు భరోసా అమలు, కౌలు రైతుల గుర్తింపుపై అధ్యయనం

రైతు భరోసా అమలు, కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కిసాన్‌ కాంగ్రెస్‌ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

Published : 10 Jul 2024 03:19 IST

కిసాన్‌ కాంగ్రెస్‌ త్రిసభ్య కమిటీ ఏర్పాటు

కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతున్న అన్వేష్‌రెడ్డి. చిత్రంలో భవానీరెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, కోదండరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి  

హైదరాబాద్, న్యూస్‌టుడే: రైతు భరోసా అమలు, కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న అంశాలపై అధ్యయనం చేసేందుకు కిసాన్‌ కాంగ్రెస్‌ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ కమిటీ ఛైర్మన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధులు, పలువురు డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ హామీల్లోని రైతుభరోసా, కౌలు రైతులకు పరిహారం అమలుకు కిసాన్‌ కాంగ్రెస్‌ తరఫున ప్రభుత్వానికి సూచనలు చేయాలని నిర్ణయించారు. ఈ అంశాలపై అధ్యయనం చేయడానికి ఆసిఫాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు విశ్వప్రసాద్, మెదక్‌ జిల్లా కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి లింగంయాదవ్‌తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. ఆయా అంశాలతో నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని