వెదిరె శ్రీరాంకు కాళేశ్వరం కమిషన్‌ పిలుపు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను హాజరుకావాలని కోరింది.

Published : 10 Jul 2024 03:19 IST

బ్యారేజీల్లో సమస్యలకు కారణాలపై ఆయన అభిప్రాయాల సేకరణ 

ఈనాడు హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను హాజరుకావాలని కోరింది. వచ్చే శుక్రవారం లేదా సోమవారం హాజరు కావాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ సూచన మేరకు నీటిపారుదల శాఖ మంగళవారం శ్రీరాంకు నోటీసు పంపినట్లు తెలిసింది. ఈయనతోపాటు 2016 నుంచి నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా పని చేసిన అధికారులను కూడా పిలవనుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత ఇందుకు గల కారణాలపై శ్రీరాం మీడియాతో మాట్లాడటం, సాంకేతిక అంశాలపై ప్రజంటేషన్‌ ఇవ్వడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్న కమిషన్‌.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో సమస్యలకు గల కారణాలపై ఆయన అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పునరాకృతి సమయంలోనూ, తర్వాత పని చేసిన నీటిపారుదల శాఖ అధికారులను కూడా పిలవాలని కమిషన్‌ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన ఎస్‌.కె.జోషి, రజత్‌కుమార్‌లతో కమిషన్‌ చర్చించనుంది.

విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ నివేదికలనూ కోరిన కమిషన్‌

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నుంచి తుది నివేదికను జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ కోరింది. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదికనూ అడిగినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఎన్డీఎస్‌ఏ, సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీడబ్ల్యూసీల నుంచి కూడా పలువురు నిపుణులను కమిషన్‌ పిలవనున్నట్లు తెలిసింది. సాంకేతిక అంశాలపై వీరి అభిప్రాయాలు తెలుసుకోనుంది. మరోవైపు సాంకేతిక అంశాలపై విచారణ తుది దశకు చేరడంతో ఇక ఆర్థికాంశాలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ దృష్టి సారించనున్నట్లు తెలిసింది.  

నేడు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లలో పని చేసిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు బుధవారం కమిషన్‌ ఎదుట హాజరుకానున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు మంగళవారం హాజరయ్యారు. పంపుహౌస్‌ల పరిస్థితి, మునగడానికి కారణాలను జస్టిస్‌ పీసీ ఘోష్‌ అడిగి తెలుసుకొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని