జాతీయ రహదారుల నిర్మాణానికి సహకరిస్తాం

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, ఆటంకాలేవైనా ఉంటే.. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 10 Jul 2024 03:20 IST

ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఆర్‌ఆర్‌ఆర్‌కు తోడ్పాటు అందించాలని వినతి

అనిల్‌ చౌధరిని సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, ఆటంకాలేవైనా ఉంటే.. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్స్‌ సభ్యుడు అనిల్‌ చౌధరి ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం రాష్ట్రానికి వచ్చింది. రేవంత్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చేపడుతున్న రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న భూసేకరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి బుధవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తాం. రహదారులు నిర్మితమయ్యే జిల్లాల కలెక్టర్లు, అటవీశాఖ అధికారులు పాల్గొంటారు. సమస్యలపై చర్చించి అక్కడే పరిష్కరించుకుందాం. రీజనల్‌ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి కేంద్రం సహకరించాలి. భారత్‌మాల పథకంలో దీన్ని చేపట్టాలని ప్రధానిని ఇటీవల కోరాం. తెలంగాణకు తీరప్రాంతం లేకపోవటంతో డ్రైపోర్ట్‌ ఏర్పాటు చేయనున్నాం. దీన్ని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానించేలా హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం చేపట్టాలి. కీలకమైన హైదరాబాద్‌-కల్వకుర్తి జాతీయ రహదారి పనులు మొదలుపెట్టాలి. ఇది నిర్మితమైతే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. హైదరాబాద్‌-మన్నెగూడ రోడ్డు, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులనూ మొదలుపెట్టాలి’ అని కోరారు. 

ఈ చిక్కుముడులను పరిష్కరించండి..

రాష్ట్రంలో పలు రహదారుల నిర్మాణంలో చిక్కుముడులు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారుల బృందం సీఎం దృష్టికి తీసుకొచ్చింది. ‘మంచిర్యాల-వరంగల్‌-ఖమ్మం-విజయవాడ కారిడార్‌ నిర్మాణానికి భూములను త్వరిగతిన అప్పగించాలి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రహదారికి భూసేకరణకు వీలుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. వరంగల్‌-కరీంనగర్‌ రహదారి నిర్మాణానికి చెరువు మట్టి, ఫ్లైయాష్‌ సేకరణకు అనుమతులు కావాలి. కాళ్లకల్‌-గుండ్లపోచంపల్లి రహదారి ఆరు వరుసల విస్తరణకు భూసేకరణ చేపట్టాలి. ఖమ్మం-దేవరపల్లి, ఖమ్మం-కోదాడ రహదారుల నిర్మాణంలో పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి’ అని కోరింది. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సీఎంవో కార్యదర్శి షానవాజ్‌ ఖాసిం, జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారి రజాక్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై ప్రతి వారం తనకు నివేదిక ఇవ్వాలని షానవాజ్‌ ఖాసింను సీఎం ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని