రైతు భరోసాపై నేటి నుంచి కార్యశాలలు

రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది.

Updated : 10 Jul 2024 03:28 IST

ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరుకానున్న మంత్రివర్గ ఉపసంఘం

ఈటీవీ, ఖమ్మం: రైతు భరోసా పథకం విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు సభ్యులు. వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగే కార్యశాలకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరుకానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధివిధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు.

జిల్లాల వారీగా..: 11న ఆదిలాబాద్, 12న మహబూబ్‌నగర్, 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలలో కార్యశాలలను మంత్రివర్గ ఉపసంఘం నిర్వహించనుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలను జోడించి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సమర్పించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని