‘కిసాన్‌ కవచ్‌’తో అభయం!

పంట పొలాలకు పురుగు మందులు వాడే క్రమంలో రైతులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోతుండడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Published : 10 Jul 2024 03:22 IST

పురుగు మందుల దుష్ప్రభావాల నుంచి రైతుకు రక్ష
బెంగళూరుకు చెందిన ‘ఇన్‌స్టెమ్‌’ ఆధ్వర్యంలో ప్రత్యేక కిట్‌ ఆవిష్కరణ

రైతుల కోసం రూపొందించిన కిసాన్‌ కవచ్‌ కిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: పంట పొలాలకు పురుగు మందులు వాడే క్రమంలో రైతులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోతుండడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆరోగ్యానికి అభయమిచ్చేలా బెంగళూరుకు చెందిన ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్టెమ్‌ సెల్‌ సైన్స్‌ అండ్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌(ఇన్‌స్టెమ్‌) ఆధ్వర్యంలో ‘కిసాన్‌ కవచ్‌’ పేరిట పీపీఈ కిట్‌ను ఇటీవల రూపకల్పన చేశారు. తెలుగు శాస్త్రవేత్తలు ప్రవీణ్‌కుమార్‌ వేముల, ఓంప్రకాశ్‌ సున్నపు, అరవింద్‌ శంకర్‌ నారాయణ, వెంకటేశ్‌రావుల బృందం ఈ కిట్‌ను తయారు చేసింది. 

మొదట జెల్‌.. ప్రస్తుతం కిట్‌ 

పంటల్లో తెగుళ్ల నివారణకు ఆర్గానో ఫాస్పేట్, కార్బమేట్, పైరిత్రాయిడ్‌ తదితర రసాయన మందులు ఎక్కువగా వాడుతుంటారు. ఈ క్రమంలో పురుగు మందుల్లో ఉండే అవశేషాలు చర్మం, ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి చేరి నాడీ సంబంధిత వ్యాధులే కాకుండా అతిసారం, డయాబెటిక్, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఇన్‌స్టెమ్‌ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో చర్మానికి రాసుకునే ఒక జెల్‌ను తయారు చేశారు. పిచికారీ చేసిన ప్రతిసారి జెల్‌ రాసుకోవాలంటే చాలామందికి ఇబ్బందిగా మారింది. దీంతో మరింత పరిశోధనల అనంతరం.. సురక్షితమైన పీపీఈ కిట్‌ తయారు చేసినట్లు పరిశోధన బృందంలో ఒకరైన శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్‌ వేముల తెలిపారు. ‘‘ఈ పురుగు మందుల్లో ఉండే ఎస్టర్లు శరీరంలోకి ప్రవేశించి.. నాడీ కండరాల పని తీరుకు కీలకమైన ఎసిటైల్‌ కోలినెస్టరేస్‌ అనే ఎంజైమ్‌ను నిరోధిస్తాయి. ఫలితంగా ఊపిరి ఆడకపోవడం, పక్షవాతం, కండరాల బలహీనత, కొన్ని రకాల క్యాన్సర్లు సంభవించే ప్రమాదం ఉంది. ఈ కిట్‌ ధరించి పిచికారీ చేస్తే అలాంటి ముప్పు ఉండదు’’ అని ప్రవీణ్‌కుమార్‌ వివరించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల ప్రముఖ సైన్సు జర్నల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమయ్యాయి.

కిట్‌ తయారు చేసిన శాస్త్రవేత్తలు ఓంప్రకాశ్‌ సున్నపు, అరవింద్‌ శంకర్‌ నారాయణ, వెంకటేశ్‌రావుల, ప్రవీణ్‌కుమార్‌ వేముల


ఎలా పని చేస్తుందంటే...

ఇన్‌స్టెమ్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన కిసాన్‌ కవచ్‌ కిట్‌లో ప్యాంట్, షర్టుతోపాటు తల, ముఖాన్ని కప్పి ఉంచే మాస్క్‌ ఉంటుంది. దీనికి ఉపయోగించే వస్త్రంలో ఆక్సెమ్‌ అనే రసాయనం.. పురుగు మందుల నుంచి వచ్చే ఎస్టర్లతో రసాయనిక చర్య జరిపి వాటిని నిర్వీర్యం చేస్తాయి. ‘‘ఈ కిట్‌ను రెండేళ్ల వ్యవధిలో 200 సార్లు ఉతికి తిరిగి ఉపయోగించవచ్చు. ఇప్పటికే ల్యాబ్‌లో ఎలుకలపై చేసిన పరీక్ష విజయవంతమైంది. తొలుత కిట్‌ ధర రూ.3000గా ఉంటుంది. వాడకం పెరిగిన తర్వాత ధర తగ్గుతుంది. ప్రభుత్వాలు ముందుకొస్తే రైతులకు రాయితీతో సరఫరా చేయొచ్చు’’ అని ప్రవీణ్‌కుమార్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని