సంక్షిప్త వార్తలు (15)

తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో మండల పరిషత్‌ అధికారుల (ఎంపీడీవోల) పరిమిత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 11 Jul 2024 03:38 IST

ఎంపీడీవోలకు ప్రత్యేక బదిలీలు.. 42 స్థానాల్లో అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో మండల పరిషత్‌ అధికారుల (ఎంపీడీవోల) పరిమిత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ 42 స్థానాలను ఖాళీగా చూపిస్తూ వాటి భర్తీకి అర్హులైన వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరి నెలలో రాష్ట్రవ్యాప్తంగా అందరు ఎంపీడీవోల బదిలీలు జరిగాయి. దీంతో ఇప్పుడు సాధారణ బదిలీల్లో వారికి అవకాశం లేకపోవడంతో పంచాయతీరాజ్‌ శాఖ ప్రత్యేక కేటగిరీల వారికి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ మేరకు దంపతులతో పాటు క్యాన్సర్, టీబీ, న్యూరో సంబంధిత తదితర వ్యాధులున్న వారికి; మూత్రపిండాలు, కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి అవకాశం ఇవ్వాలని సూచించింది. ఒక్కొక్కరి నుంచి ఐదేసి స్థానాలకు ఐచ్ఛికాలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనలు తీసుకొని పంపించాలని తెలిపింది. ఆయా కేటగిరీల కింద ఎక్కువ దరఖాస్తులు వస్తే తప్పనిసరి బదిలీ అవసరమైన వారికి అవకాశం కల్పించాలని పంచాయతీరాజ్‌ శాఖ భావిస్తోంది.


అవి నకిలీ లింకులు.. వివరాలు నింపొద్దు

నిరుద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ సూచన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న లింకులు నకిలీవని(ఫేక్‌) టీజీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆ లింకులను నమ్మొద్దని, వాటిని క్లిక్‌ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని నిరుద్యోగులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో బుధవారం ట్వీట్‌ చేశారు. టీజీఎస్‌ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలపై కసరత్తు జరుగుతోందని, సోషల్‌మీడియాలో వైరలయ్యే ఫేక్‌ లింకులను నమ్మొద్దని సంస్థ స్పష్టం చేసింది.


ముగిసిన ఆర్జీయూకేటీ ప్రవేశాల కౌన్సెలింగ్

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ప్రవేశాల కోసం మూడు రోజులుగా జరుగుతున్న కౌన్సెలింగ్‌ బుధవారంతో ముగిసింది. మొత్తం 1404 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించగా వారిలో 108 మంది గైర్హాజరైనట్లు అధికారులు చెప్పారు. ఈ విడతలో మిగిలిన సీట్లను మరో విడతలో భర్తీచేస్తామన్నారు. దివ్యాంగులు, స్పోర్ట్స్, క్యాప్‌ కోటాలో సీట్ల కోసం త్వరలో మెరిట్‌ జాబితాను విడుదల చేసి ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.  


గ్రూప్‌-2, 3 పరీక్షల వాయిదా అవాస్తవం: టీజీపీఎస్సీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-2, 3 పరీక్షలను రీషెడ్యూలు చేసినట్లు సోషల్‌మీడియా, వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ‘‘ఈ రెండు సర్వీసుల పరీక్షలను కమిషన్‌ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్‌ నోట్‌ సర్క్యులేట్‌ అవుతోంది. గ్రూప్‌-2 పరీక్షలు నవంబరు 17, 18న, గ్రూప్‌-3 పరీక్షలు నవంబరు 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరు నకిలీ వెబ్‌నోట్‌ సృష్టించి, వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దు’’ అని కమిషన్‌ తెలిపింది. 


గ్రూప్‌-1 మెయిన్స్‌కు ఎస్సీ స్టడీ సర్కిల్‌ నుంచి 473 మంది ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు ఎస్సీ స్టడీసర్కిల్‌లో శిక్షణ పొందిన 473 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. వీరిలో హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌కు చెందిన 126 మంది ఉన్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు సకాలంలో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కార్యక్రమాలు విజయవంతమయ్యాయని వివరించారు. 


తెలంగాణ స్టడీసర్కిల్‌కు రూ.6.25 కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్టడీసర్కిల్‌కు బీసీ సంక్షేమశాఖ రూ.6.25 కోట్లు మంజూరుచేసింది. స్టడీసర్కిల్‌ కోసం బడ్జెట్‌లో రూ.8.33 కోట్లు కేటాయించగా, తొలివిడత రూ.6.25 కోట్లు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రావెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. 


గురుకుల డిగ్రీ కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు 

ఈనాడు, హైదరాబాద్‌: బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలో 29 డిగ్రీ కళాశాలల్లో 31 కోర్సులు ఉన్నాయని.. అర్హులైన విద్యార్థులు కళాశాలల్లో చేరాలని కోరారు. 


వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌ ప్రారంభం  

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం కౌన్సెలింగ్‌ మొదలైంది. రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కౌన్సెలింగ్‌ను రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి ప్రారంభించారు. ‘పాలిసెట్‌-2024’లో 455 ర్యాంకు పొందిన అరియాజరీన్‌కు జగిత్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పిస్తూ ధ్రువపత్రాలను అందజేశారు. పాలిసెట్‌లో 690 ర్యాంకు సాధించిన బి.లోకేశ్‌ నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ మాట్లాడుతూ.. ఈ నెల 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్‌ విభాగం డైరెక్టర్‌ జమునా రాణి, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ శ్రవణ్‌కుమార్, సహ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


డీఈఈసెట్‌కు 86 శాతం మంది హాజరు

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నిర్వహించిన డీఈఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు 85.96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక ‘కీ’ని ఈ నెల 15వ తేదీలోపు వెల్లడిస్తామన్నారు.


ఇంటర్‌ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువు అక్టోబరు 31

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ ఇచ్చే నేషనల్‌ స్కాలర్‌షిప్‌ కోసం అక్టోబరు 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థుల జాబితా ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉందని, ఆ జాబితాలో పేరు ఉన్నవారు www.scholarship.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ స్లాట్‌ బుకింగ్‌ గడువు రేపటి వరకే

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద బీటెక్‌ సీట్లు పొందాలనుకునే వారి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకునే గడువు ఈ నెల 12వ తేదీతో ముగియనుంది. అందుకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బుధవారం వరకు 97,309 మంది స్లాట్‌ బుక్‌ చేసుకోగా.. వారిలో 33,922 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అత్యధికంగా ఒక విద్యార్థి 942 ఆప్షన్లు ఇచ్చారని ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన బుధవారం తెలిపారు.


చనిపోయిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం

ఈనాడు, హైదరాబాద్‌: 2013లో ప్రమాదవశాత్తు వసతిగృహ భవనం నుంచి కిందపడి చనిపోయిన డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థి జె.చంద్రకాంత్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం మంజూరు చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు 2014 సెప్టెంబరు 14 నుంచి 2024 మార్చి 31 వరకు 6శాతం వడ్డీ, కోర్టు ఖర్చుల కింద మరో రూ.35,042 చెల్లించనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌లోని ప్రభుత్వ బాలుర బీసీ వసతి గృహంలో నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో చంద్రకాంత్‌ తలకు తీవ్రగాయమై మరణించారు. సీఎం సహాయ నిధి కింద ప్రభుత్వం రూ.లక్ష పరిహారం అప్పట్లో చెల్లించింది. మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని జాదవ్‌ పరశురాంపటేల్‌ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారించిన కోర్టు ఆ విద్యార్థి కుటుంబానికి వడ్డీతో కలిపి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం కింద రూ.6 లక్షలు, వడ్డీ కింద రూ.3,07,800, కోర్టు ఖర్చులకు రూ.35,042 లెక్కన మొత్తం రూ.9,42,842 బీసీ సంక్షేమశాఖ మంజూరు చేసింది. 


కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ద.మ.రైల్వే జీఎం భేటీ 

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో హైదరాబాద్‌లోని దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రీజియన్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి గురించి రైల్వే జనరల్‌ మేనేజర్‌ కేంద్రమంత్రికి    వివరించారు.

ఈనాడు, హైదరాబాద్‌ 


నేడు తెలంగాణ ఇంజినీర్స్‌డే

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఇంజినీర్స్‌ డే ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జలసౌధలోని అలీ నవాజ్‌జంగ్‌ బహదూర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. సాయంత్రం విశ్వేశ్వరయ్య భవన్‌లో ఉత్సవాలు జరుగుతాయి.  


డీర్‌ పార్క్‌ పర్యవేక్షణకు కమిటీ

ఈనాడు, దిల్లీ: పర్యావరణ సున్నిత ప్రాంతంగా ప్రకటించిన హైదరాబాద్‌ వనస్థలిపురం సమీపంలోని మహవీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్క్‌ పర్యవేక్షణ కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక ప్రతినిధి, ఒక పర్యావరణ నిపుణుడిని తెలంగాణ ప్రభుత్వం ఇందులో సభ్యుడిగా నియమించొచ్చు. జిల్లా వన్యప్రాణి సంరక్షకుడు లేదంటే డివిజినల్‌ అటవీఅధికారి ఈ కమిటీకి మెంబర్‌ సెక్రటరీగా వ్యవహరిస్తారు. డీర్‌ పార్క్‌గా ప్రసిద్ధి పొందిన ఈ నేషనల్‌ పార్క్‌ 3,605 ఎకరాల్లో విస్తరించి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని