జీవోలపై ‘గొర్రె’దాటు వ్యవహారం!

గొర్రెల పంపిణీలో కుంభకోణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు సయ్యద్‌ మొహిదుద్దీన్‌ ముఠాకు.. ఈ కేసులో నిందితుడు, అప్పటి రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య (టీఎస్‌ఎస్‌జీడీసీఎఫ్‌ఎల్‌) ఎండీ రాంచందర్‌నాయక్‌ సహకరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

Published : 11 Jul 2024 03:11 IST

గొర్రెల పంపిణీ కుంభకోణానికి సమాఖ్య పూర్వ ఎండీ సహకారం
నిబంధనలు ఉల్లంఘించి ప్రధాన నిందితుడికి అండదండలు
ఆధారాలు సేకరించిన ఏసీబీ

ఈనాడు, హైదరాబాద్‌: గొర్రెల పంపిణీలో కుంభకోణానికి పాల్పడిన ప్రధాన నిందితుడు సయ్యద్‌ మొహిదుద్దీన్‌ ముఠాకు.. ఈ కేసులో నిందితుడు, అప్పటి రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య (టీఎస్‌ఎస్‌జీడీసీఎఫ్‌ఎల్‌) ఎండీ రాంచందర్‌నాయక్‌ సహకరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ కుంభకోణంలో సుమారు రూ.700 కోట్ల మేర కొల్లగొట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించిన విషయం తెలిసిందే. దళారులకు ఫెసిలిటేటర్ల ముసుగు వేయించి.. వారి ద్వారానే గొర్రెలను కొనుగోలు చేయించడం ద్వారా రాంచందర్‌నాయక్‌ ఈ అక్రమాలను ప్రోత్సహించినట్లు వెల్లడైంది. ఇందుకోసం పలు జీవోలను ఉల్లంఘించినట్లు ఏసీబీ గుర్తించింది. 

‘5 గొర్రెల కొనుగోలు’ నిబంధన బేఖాతరు

గొర్రెల కొనుగోలు కోసం నేరుగా పెంపకందారులనే సంప్రదించాలని జీవో 52లో ప్రభుత్వం స్పష్టంచేసినా.. దీన్ని ఉల్లంఘించారు. ఒక పెంపకందారు నుంచి 5 గొర్రెలను మాత్రమే కొనాలన్న నిబంధననూ పట్టించుకోలేదు. దళారుల ద్వారానే గొర్రెల కొనుగోలును ప్రోత్సహించారు. 2019 సెప్టెంబరు 18న జారీచేసిన ఎల్‌.ఆర్‌.నం.193/టీ2 తోపాటు 2021 ఫిబ్రవరి 11న పశుసంవర్ధకశాఖ జారీ చేసిన జీఓ 8, జీవో 28.. అదే ఏడాది జులై 12న జారీ చేసిన జీవో 80లలోని నిబంధనలను పక్కన పెట్టేసినట్లు ఏసీబీ గుర్తించింది. దళారులతో కుమ్మక్కై వారికి లబ్ధి చేకూర్చేందుకు రాంచందర్‌నాయక్‌ ఈ పనిచేసినట్లు ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్‌.. రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, వనపర్తి, గద్వాల జిల్లాల్లోని లబ్ధిదారులకు గొర్రెలను సరఫరా చేయగలిగాడు.

కరపత్రాలు పంచి మరీ..

ఒక యూనిట్‌ గొర్రెలను తమ కంపెనీ (లొలొనా లైవ్‌స్టాక్‌ కంపెనీ) ద్వారా కొనుగోలు చేస్తే లబ్ధిదారులకు రూ.20 వేల క్యాష్‌బ్యాక్‌ ఇస్తామంటూ దళారీ అయిన మొహిదుద్దీన్‌ 2021 ఏప్రిల్‌లో కరపత్రాలు ముద్రించి, సమాఖ్య కార్యాలయంలోని గోడలకు అతికించాడు. రాంచందర్‌ సమాఖ్య ఎండీగా బాధ్యతలు స్వీకరించాకే ఇది జరిగింది. అదే సమయంలో ఆయన పశుసంవర్ధకశాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మొహిదుద్దీన్‌ను ప్రోత్సహించాలని పశుసంవర్ధకశాఖ అధికారులకు రాంచందర్‌నాయక్‌ మౌఖికఆదేశాలు జారీచేశారు. లొలొనా కంపెనీ ద్వారానే గొర్రెలను కొనాలని ఆయన ఆదేశించినట్లు అధికారులు ఏసీబీ విచారణలో అంగీకరించారు.

ఇదే కేసులో మరో నిందితుడు, తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్‌ 2023 సెప్టెంబరు 22న కీలక ఆదేశాలిచ్చినట్లు ఏసీబీ గుర్తించింది.  

మొహిదుద్దీన్‌తో కుమ్మక్కుపై ఆధారాలు

మొహిదుద్దీన్‌ చాలాసార్లు సమాఖ్య కార్యాలయానికి వచ్చి రాంచందర్‌నాయక్‌ను కలిసేవారని సమాఖ్యలో పనిచేసిన సహాయ సంచాలకుడొకరు ఏసీబీకి వాంగ్మూలమిచ్చారు. గొర్రెల కొనుగోలు శిబిరాలకు ఏ అధికారులను పంపుతున్నారనే విషయాన్ని రాంచందర్‌ సహకారంతో మొహిదుద్దీనే ముందుగా ఆ అధికారులకు వెల్లడించేవాడని గుర్తించారు. దీన్నిబట్టి వీరిద్దరూ కుమ్మక్కయ్యారని ఏసీబీ నిర్ధారణకు వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని