అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు

రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

Published : 11 Jul 2024 03:33 IST

చిన్నారులకు యూనిఫాంలు అందిస్తాం
మంత్రి సీతక్క వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు బోధించనున్నట్లు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెంచేందుకు ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట’ పేరుతో జులై 15 నుంచి వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారమిక్కడ అంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్‌కేర్‌ అంశాలపై శిశు సంక్షేమశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ కాంతివెస్లీతో కలిసి జిల్లా సంక్షేమాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యునెస్కో సహకారంతో రూపొందించిన న్యూట్రిషియన్‌ ఛాంపియన్‌ పుస్తకం, న్యూట్రిషియన్‌ కిట్లను ఆవిష్కరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాసిరకం సరకుల కట్టడికి క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆమె ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలి. భవనాలకు పెయింటింగ్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి. చిన్నారులకు దేశంలోనే తొలిసారిగా త్వరలో యూనిఫాంలు అందిస్తాం. తెలంగాణను పోషకాహారలోప రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. మహిళలు, చిన్నారులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి పేర్కొన్నారు.

మంత్రిని కలిసిన ఎన్జీవోల ప్రతినిధులు

రాష్ట్రంలో మహిళా సంరక్షణ, సాధికారతపై పనిచేసేందుకు పలు ఎన్జీవోలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. బుధవారమిక్కడ తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధి, కాలిఫోర్నియాకు చెందిన మంజుల కృష్ణన్, అంకురం ఎన్జీవో ప్రతినిధులు సుమిత, విజయ మంత్రి సీతక్కను కలిశారు. తెలంగాణలో మహిళా, శిశు సంరక్షణ కమిటీల్ని బలోపేతం చేయాలని, అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించేందుకు నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్జీవో ప్రతినిధులను మంత్రి కోరగా వారు అంగీకరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని