మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు

ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని మోనాష్‌ యూనివర్సిటీ - ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు.

Published : 11 Jul 2024 03:34 IST

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

ప్రొఫెసర్‌ మూర్తి, ఎలిశెట్టి మోహన్‌లతో సమావేశమైన భట్టి

 

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లోని మోనాష్‌ యూనివర్సిటీ - ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో మైనింగ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. బుధవారం సచివాలయంలో ఆయనతో ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ మూర్తి, మోనాష్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎలిశెట్టి మోహన్‌ సమావేశమై చర్చించారు. బ్యాటరీలలో వినియోగించే లిథియం వంటి కీలక ఖనిజాల ఉత్పాదన భారత్‌లో ఆశించిన మేర జరగడం లేదని వారు చెప్పారు. వాటి ఉత్పత్తికి ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తే.. దేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కీలక ఖనిజాల అంశంపై ఐఐటీ హైదరాబాద్, మోనాష్‌ యూనివర్సిటీ భాగస్వాములుగా పరిశోధనలు చేస్తున్నాయని వివరించారు. సింగరేణి గనుల వద్ద విద్యుత్‌ నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్పారు. ఇందుకు సింగరేణి నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన పంపులను ఉపయోగించి పగటిపూట విద్యుత్‌ వినియోగం అధికంగా ఉన్న సమయాల్లో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పాదన చేయవచ్చని తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని వివరించారు. కొత్తగా ఏర్పాటుకానున్న స్కిల్‌ యూనివర్సిటీతో ఐఐటీ హైదరాబాద్‌ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపుతోందని ప్రొఫెసర్‌ మూర్తి ఉప ముఖ్యమంత్రికి చెప్పారు. భట్టి స్పందిస్తూ రాష్ట్రానికి మేలు చేసే ఏ అంశానికైనా ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని