పర్యాటక ప్రగతిలో మనమెక్కడ?

పర్యాటకంగా రాష్ట్రంలో అనేక ఆకర్షణలు ఉన్నా... ఆ రంగంలో పురోగమనం మాత్రం లేదు. 2022లో దేశీయ పర్యాటకుల్లో రాష్ట్ర వాటా 2022లో 3.51 శాతం...విదేశీ పర్యాటకుల్లో 0.80 శాతమే ఉంది.

Updated : 11 Jul 2024 03:48 IST

ప్రోత్సాహకాలతో పొరుగు రాష్ట్రాల పరుగులు
2021, 2022 గణాంకాలు చాటుతున్న వాస్తవాలు

పర్యాటకంగా రాష్ట్రంలో అనేక ఆకర్షణలు ఉన్నా... ఆ రంగంలో పురోగమనం మాత్రం లేదు. 2022లో దేశీయ పర్యాటకుల్లో రాష్ట్ర వాటా 2022లో 3.51 శాతం...విదేశీ పర్యాటకుల్లో 0.80 శాతమే ఉంది. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మన కంటే ముందంజలో ఉన్నాయి. తెలంగాణతో పోలిస్తే మధ్యప్రదేశ్‌ను దాదాపు మూడు రెట్ల మంది విదేశీయులు సందర్శించారు. ప్రకృతి పర్యాటకం అభివృద్ధిపై అటవీశాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో గడిచిన కొన్నేళ్లలో తెలంగాణలో పర్యటించిన దేశీయ, విదేశీ పర్యాటకుల వివరాలను పర్యాటకశాఖ పేర్కొంది.   

ఎందుకీ పరిస్థితి?

కేంద్ర పర్యాటకశాఖ తమ వెబ్‌సైట్‌లో 2020-22 వరకు రాష్ట్రాలవారీ గణాంకాలను పొందుపరిచింది. దీనిప్రకారం పర్యాటక రంగంలో 2022లో తెలంగాణ దేశంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. తమిళనాడు, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాలు పర్యాటక పాలసీని రూపొందించి అమలు చేస్తున్నాయి. ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో పర్యాటక పాలసీ ఖరారు కాకపోవడంతో ఆశించినంత ప్రైవేటు పెట్టుబడులు రావడం లేదు.

హైదరాబాద్‌కే పరిమితం

రాష్ట్రానికి వచ్చే పర్యాటకులు హైదరాబాద్, శివారు ప్రాంతాలకే పరిమితమవుతున్నారు. జిల్లాల్లో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు రాష్ట్రానికి ఓ విధానం లేదు. బడ్జెట్‌ కేటాయింపులూ అతిస్వల్పం. ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేయడంలో పర్యాటకశాఖ, టూరిజం కార్పొరేషన్‌ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ఇతర రాష్ట్రాల పర్యాటక శాఖలు ప్రకటనలు ఇస్తుంటే... రాష్ట్రం ప్రచార ఊసే కనిపించట్లేదు. రెండేళ్లక్రితం హైటెక్స్‌లో జాతీయస్థాయి పర్యాటక సదస్సు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ నిర్వహించింది. అందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పర్యాటక ప్రదేశాల గురించి స్టాళ్లతో ప్రచారం చేసుకోగా, తెలంగాణ స్టాల్‌ని ఏర్పాటు చేయలేదు.


ఎన్నెన్నో ఆకర్షణలు

రాష్ట్రంలో అనేక పర్యాటక ఆకర్షణలున్నాయి. గోల్కొండ కోట, చార్మినార్, రామోజీ ఫిలింసిటీ, తెలంగాణ సచివాలయం, రామప్ప ఆలయం, యాదాద్రి, భద్రాచలం..అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు, అనంతగిరి అడవులు..నాగార్జునసాగర్‌ డ్యాం, లక్నవరం, బొగత జలపర్యాటక ప్రాంతాలు.. చేనేతకు ప్రసిద్ధి చెందిన భూదాన్‌ పోచంపల్లి, ప్రపంచం నలుమూలల నుంచి ఆకర్షించగలిగే బుద్ధవనం ప్రాజెక్టు వంటి పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి దేశంలో ప్రధాన నగరాలకు, విదేశాలకు నేరుగా విమాన సౌకర్యం ఉంది. దేశంలో ప్రధాన నగరాలకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయినా పర్యాటకులను ఆకర్షించడంలో వెనుకే ఉన్నాయి.


 ఇదీ తీరు...

2021లో కొవిడ్‌ ప్రభావంతో పర్యాటక రంగం    తెలంగాణ సహా దేశవ్యాప్తంగా తీవ్రంగా దెబ్బతింది.   ఆ తర్వాత ఏడాది నుంచి పుంజుకుంటోంది. 2020 నుంచి 2022 వరకు రాష్ట్రానికి ఎంతమంది పర్యాటకులు వచ్చారంటే..

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు