హైస్కూళ్లకు గణితం, సైన్స్‌ కిట్లు

పాఠశాలల్లో పిల్లలకు పాఠాలను బోధించడంతో పాటు.. ఆయా పాఠ్యాంశాలను బొమ్మలు, ప్రాజెక్టుల ద్వారా నేర్పిస్తే మరింత సులభంగా అర్థమవుతుంది.

Published : 11 Jul 2024 03:34 IST

రూ.10.89 కోట్లతో 2,635 పాఠశాలలకు సరఫరాకు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాలల్లో పిల్లలకు పాఠాలను బోధించడంతో పాటు.. ఆయా పాఠ్యాంశాలను బొమ్మలు, ప్రాజెక్టుల ద్వారా నేర్పిస్తే మరింత సులభంగా అర్థమవుతుంది. ఇక ఎప్పటికీ మరిచిపోరు. ఈ దిశగా పాఠశాలలకు గణితం, సైన్స్‌ కిట్లను అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఐఐటీ గాంధీనగర్‌ వాటిని అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,635 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు వాటిని సరఫరా చేయనున్నారు. ఒక్కో గణితం కిట్‌కు రూ.11 వేలు, సైన్స్‌ కిట్‌కు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.10.89 కోట్లు ఖర్చు చేయనున్నారు. సమగ్ర శిక్షా ద్వారా విడుదలయ్యే నిధులను అందుకు వినియోగిస్తారు. ఐఐటీ గాంధీనగర్‌లో సెంటర్‌ ఫర్‌ క్రియేటివ్‌ లెర్నింగ్‌ పేరిట ప్రత్యేక కేంద్రం ఉంది. అక్కడి నిపుణులు గణితం, సైన్స్‌ను పిల్లలకు సులభంగా.. సృజనాత్మకంగా ఎలా అర్థమయ్యేలా చేయవచ్చో అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల కిట్లను రూపొందించారు. కొద్ది రోజుల క్రితం వరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన శ్రీదేవసేన గత ఏడాది స్వయంగా ఐఐటీ గాంధీనగర్‌లోని ఆ కేంద్రాన్ని సందర్శించి వచ్చారు. అనంతరం వాటిని ప్రభుత్వ పాఠశాలలకు అందజేయాలని నిర్ణయించారు. పలువురు ఉపాధ్యాయులు సైతం ఆ కేంద్రంలో ఇప్పటికే శిక్షణ పొందారు. ఆయా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇవ్వనుంది.  

 4,337 చోట్ల  సైబర్‌ నేరాలపై అవగాహన

సైబర్‌ నేరాలపై 4,337 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు      చేపడతారు. అందుకు విద్యార్థులతో కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. దీనికి రూ.21 లక్షలు ఖర్చు చేస్తారు.

  • పాఠశాల విద్య ముగిసేలోపు ఏదో ఒక వృత్తి నైపుణ్యం సాధించేలా విద్యార్థులకు ఒకేషనల్‌ విద్యను అందిస్తారు. ఈ మేరకు ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25)లో రూ.4.95 కోట్లతో కొత్తగా 32 కేజీబీవీలతోపాటు మొత్తం 99 పాఠశాలల్లో వాటిని ప్రవేశపెడతారు. ఇంటర్న్‌షిప్, ఉద్యోగ మేళాలు, బిజినెస్‌ ఇన్నోవేటర్స్‌-ఆంత్రప్రెన్యూర్‌షిప్, శిక్షకుల వేతనాలు, గతంలో కొనసాగుతున్న వాటికి కలిపి మొత్తం రూ.43.73 కోట్లు కేటాయించారు. విద్యార్థులకు ప్రాక్టికల్‌ శిక్షణ కోసం 21 హబ్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు. అక్కడికి పరిసర ప్రాంతాల విద్యార్థులు వచ్చి ప్రాక్టికల్స్‌ చేస్తారు.
  • 275 పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతి గదుల ఏర్పాటు, ఇతర పనులకు రూ.25.88 కోట్లు కేటాయించారు. 
  • 5,439 పాఠశాలల్లోని బాలికలకు ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్‌ కార్యక్రమం పేరిట రూ.8.15 కోట్లు వెచ్చించనున్నారు.
  • రాష్ట్రంలోని 10 డైట్‌ కళాశాలలకు రూ.10.72 కోట్లు ఇవ్వనున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని