ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత

విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించాలని, డీఎస్సీ వాయిదా వేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు.. వారు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది.

Published : 11 Jul 2024 03:28 IST

తెలంగాణ విద్యార్థి పరిషత్‌... బీఆర్‌ఎస్వీ వేర్వేరుగా ఆందోళనలు 

ఈనాడు, హైదరాబాద్‌ - లాలాపేట, న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించాలని, డీఎస్సీ వాయిదా వేయాలంటూ విద్యార్థుల ఆందోళనలు.. వారు బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బుధవారం ఉద్రిక్తత ఏర్పడింది. తెలంగాణ విద్యార్థి పరిషత్‌(టీవీపీ) విద్యార్థులు.. బీఆర్‌ఎస్వీ ప్రతినిధులు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టడంతో పోలీసులు క్యాంపస్‌ మొత్తాన్ని చుట్టుముట్టారు. వసతి గృహాల్లోకి ఉదయాన్నే చేరుకుని ఉన్నవారిని ఉన్నట్టు అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. 

ప్రధాన గ్రంథాలయం వద్ద ఆందోళన

ఓయూ ప్రధాన గ్రంథాలయం వద్ద ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులు, బీఆర్‌ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు నిలువరించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దృశ్యాలను చిత్రీకరించిన ఓ విలేకరిని.. పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడానికి యత్నించిన పలువురు డీఎస్సీ అభ్యర్థులు, బీఆర్‌ఎస్వీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని లాక్కెళ్లి అరెస్టుచేశారు. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడం దారుణమని భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు పేర్కొన్నారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. 

కోదండరాం ఇంటి ముట్టడి భగ్నం

వర్సిటీలకు వీసీలను నియమించేలా ముఖ్యమంత్రిపై ఒత్తిడి చేయాలంటూ తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఇంటి ముట్టడికి యత్నించిన తెలంగాణ విద్యార్థి పరిషత్‌ నాయకుల్ని పోలీసులు నిలువరించారు. పది రోజుల్లో వీసీలను నియమించకుంటే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల బంద్‌ పాటిస్తామని టీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ చెప్పారు. 


జర్నలిస్టులపై పోలీసుల వైఖరి దుర్మార్గం

ఖండించిన కేటీఆర్, హరీశ్‌రావు, భారాస నేతలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేదా అని వారు ప్రశ్నించారు. ఓయూలో డీఎస్సీ అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను విధి నిర్వహణలో భాగంగా కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్ట్‌ చేశారని విమర్శించారు. ‘నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసు ప్రవర్తన, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిస్టు గల్లా పట్టి లాక్కెళ్లి అరెస్టు చేయడం..ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే?’ అని వారు ప్రశ్నించారు. జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, భారాస విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్‌ తదితరులు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని