చెంచు మహిళపై దాడి ఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అమానుష సంఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు.

Published : 11 Jul 2024 03:28 IST

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ వెంకటయ్య

కొల్లాపూర్, న్యూస్‌టుడే: చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అమానుష సంఘటనలో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతామని, అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం మొలచింతలపల్లిలో బుధవారం కమిషన్‌ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబునాయక్, శంకర్‌లతో కలిసి ఆయన పర్యటించారు. బాధితురాలు ఈశ్వరమ్మ ఇంటికెళ్లి పరామర్శించారు. దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని, ఆయన వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితురాలు తెలిపారు. ఈశ్వరమ్మ ఇంటి నిర్మాణానికి ఐటీడీఏ రూ.5 లక్షలు మంజూరు చేయగా.. నిర్మాణ పనుల్ని వెంకటయ్య ప్రారంభించారు. పోడు భూములకు పట్టాలు, ఆధార్, రేషన్‌ కార్డులు, రైతుబంధు, రైతుభీమా తదితర పథకాలకు సంబంధించిన సమస్యలను కమిషన్‌ బృందానికి చెంచులు వివరించారు. అనంతరం వెంకటయ్య విలేకరులతో మాట్లాడుతూ.. ఈశ్వరమ్మపై దాష్టీకం సిగ్గుచేటని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి చెంచుల సమస్యల్ని పరిష్కరిస్తామని, పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. చెంచులకు రక్షణ కల్పించాలని కొల్లాపూర్‌ సీఐ మహేశ్‌ను వెంకటయ్య ఆదేశించారు. కార్యక్రమంలో కొల్లాపూర్‌ ఆర్డీవో నాగరాజు, తహసీల్దార్‌ శ్రీకాంత్, డీటీడీవో కమలాకర్‌రెడ్డి, ఐటీడీఏ మేనేజర్‌ జాఫర్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని