GHMC: వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.

Published : 16 Jun 2024 06:07 IST

నోటీసులిచ్చినా స్పందించకపోవడంతో జీహెచ్‌ఎంసీ చర్యలు

హైదరాబాద్‌లో జగన్‌ ఇంటి ముందున్న అక్రమ కట్టడాలను పొక్లెయిన్‌తో కూల్చివేస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది

ఫిల్మ్‌నగర్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. తరచూ ట్రాఫిక్‌జాం సమస్యలు తలెత్తేవి. ఈ ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతుండడంతో రహదారికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని లోటస్‌పాండ్‌లోని జగన్‌ నివాస సిబ్బందికి జీహెచ్‌ఎంసీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలను వారు పట్టించుకోలేదు. దీంతో పోలీసు భద్రత మధ్య.. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది వచ్చి పొక్లెయిన్‌తో అక్రమ కట్టడాలను పూర్తిగా నేలమట్టం చేశారు. ఈ ఆక్రమణల వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయంటూ స్థానికుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌ డిప్యూటీ కమిషనర్‌ వి.ప్రశాంతి తెలిపారు. అక్రమ నిర్మాణాలను తొలగించాలని అక్కడి సిబ్బందికి పలుమార్లు సూచించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను అధికారులు పరిష్కరించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని