rivers linking project: ఇచ్చంపల్లికి బదులుగా సమ్మక్కసాగర్‌ నుంచే కావేరికి..

నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌కు ఇచ్చంపల్లికి బదులుగా సమ్మక్కసాగర్‌ నుంచి నీటిని తీసుకోవడంపై అధ్యయనం చేయాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్ణయించింది.

Published : 22 Jun 2024 04:19 IST

గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం 
9న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్‌కు ఇచ్చంపల్లికి బదులుగా సమ్మక్కసాగర్‌ నుంచి నీటిని తీసుకోవడంపై అధ్యయనం చేయాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నిర్ణయించింది. వచ్చే నెల 9న దిల్లీలో జరగనున్న సంస్థ సాధారణ సమావేశంలో ఈ అంశంపై చర్చించేందుకు ఎజెండాలో చేర్చింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్రాలకు సమాచారం అందించింది. ఇన్నాళ్లూ గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి కావేరి నది పరీవాహకానికి నీటిని తరలించాలనేది ఆ సంస్థ లక్ష్యంగా ఉంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందించి ముసాయిదాను గతంలోనే రాష్ట్రాలకు పంపించింది. అయితే, ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణంతో ఎగువన ఉండే కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, దిగువన ఉండే సమ్మక్క బ్యారేజీలకు నష్టం జరుగుతుందని తెలంగాణ వాదిస్తూ వస్తోంది. బదులుగా సమ్మక్క నుంచి నీటిని తీసుకోవాలని ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు గతేడాది ఎన్‌డబ్ల్యూడీఏ అధికారుల బృందం సమ్మక్కసాగర్‌ను సందర్శించి పరిశీలన చేపట్టింది. నీటి నిల్వ, తరలింపు అంశాలను నమోదు చేసుకుని ఉన్నతాధికారులకు నివేదించింది.  

అధ్యయనానికి నిర్ణయం 

గోదావరిలో వినియోగానికి వెసులుబాటు ఉన్న 141 టీఎంసీలను(ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని) నదుల అనుసంధాన ప్రాజెక్టులోకి తరలించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, నీటిని తీసుకునే ప్రాంతంపై మొదటి నుంచి అస్పష్టత నెలకొంది. ప్రతిపాదిత ఇచ్చంపల్లిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాంతానికి దిగువన 158 టీఎంసీల నీటి వినియోగం ఉన్న దేవాదుల, సమ్మక్కసాగర్, సీతారామ ఎత్తిపోతలు ఉన్నాయని చెబుతోంది. ఇచ్చంపల్లి దిగువన 24 కి.మీ. వద్ద సమ్మక్కసాగర్‌ బ్యారేజీ ఉన్న కారణంగా ఆకస్మికంగా వరదలు సంభవిస్తే నియంత్రణ సాధ్యం కాదని వాదిస్తోంది. అందుకే సమ్మక్కసాగర్‌ను అనుసంధానంలో తీసుకోవాలని సూచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని