TG News: గ్రాట్యుటీ ఔదార్యం కాదు.. ఉద్యోగి హక్కు: హైకోర్టు

పదవీ విరమణానంతరం పొందే గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అని, అదేమీ యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని హైకోర్టు తేల్చిచెప్పింది.

Published : 09 Jul 2024 02:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదవీ విరమణానంతరం పొందే గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అని, అదేమీ యాజమాన్యం ఔదార్యంతో ఇచ్చేది కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. పదవీ విరమణ అనంతరం ఉద్యోగికి, లేదంటే మరణానంతరం ఉద్యోగి వారసులకు చట్టం ప్రకారం గ్రాట్యుటీ పొందే హక్కు ఉందని తెలిపింది. ఉద్యోగులు గ్రాట్యుటీ పెంచిన సీలింగ్‌కు అర్హులంటూ పీఎఫ్‌ అప్పిలేట్‌ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్‌ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. 2007-10 మధ్య వందల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయగా వారికి గ్రాట్యుటీ సీలింగ్‌ పరిమితి రూ.3.5 లక్షల కింద కాకుండా రూ.10 లక్షలుగా చెల్లించాలంటూ అప్పిలేట్‌ తీర్పు వెలువరించింది. ఈసీఐఎల్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌ నిబంధనల ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ గ్రాట్యుటీ సీలింగ్‌ రూ.3.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవీ విరమణ చేసినందువల్ల ఆ పెంపు వర్తించదన్నారు. ఉద్యోగుల తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి రూ.3.5 నుంచి రూ.10 లక్షలకు పెంచాలని బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ తీర్మానించిందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి గ్రాట్యుటీ ఉద్యోగి హక్కు అని పేర్కొన్నారు. ఇప్పటికే చెల్లించిన మొత్తం పోను మిగిలిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలన్న అప్పిలేట్‌ అథారిటీ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈసీఐఎల్‌ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని