TG News: పోలీసులకే కష్టమొస్తే..!

సామాన్యులకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకొంటారు. మరి వారికే కష్టమొస్తే..? అది కూడా పైఅధికారుల నుంచైతే..? ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా బయటపడాలి?

Updated : 09 Jul 2024 07:17 IST

అధికమవుతున్న అధికారుల వేధింపులు
అఘాయిత్యాలకు పాల్పడుతున్న సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: సామాన్యులకు సమస్యలుంటే పోలీసులకు చెప్పుకొంటారు. మరి వారికే కష్టమొస్తే..? అది కూడా పైఅధికారుల నుంచైతే..? ఆ బాధ ఎవరితో పంచుకోవాలి, ఎలా బయటపడాలి? ధైర్యం ఉన్నవాళ్లు బదిలీ చేయించుకుని వెళ్లిపోవడమో, సెలవు పెట్టడమో చేస్తుంటారు. ధైర్యం లేనివారు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఉదంతమే ఇందుకు నిదర్శనం. పోలీసుశాఖలో అధికారుల వేధింపులు కొత్త కాకున్నా.. ఇలాంటి ఘటనలు బయటపడ్డప్పుడు మాత్రం దీనిపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత అంతా మరిచిపోతున్నారు. క్రమశిక్షణతో మసలుకోవాల్సిన పోలీసుశాఖలో ఇదే క్రమశిక్షణ కిందిస్థాయి సిబ్బందికి శాపంగా మారుతోంది. తాము చెప్పినట్లు వినకపోతే పైఅధికారులు వేధింపులకు పాల్పడుతుంటారు. డ్యూటీల మీద డ్యూటీలు వేస్తారు, చేయలేకపోతే చర్యలకు ఉపక్రమిస్తారు. తమ మాట వినని వారికి వరుసగా నైట్‌డ్యూటీ వేయొచ్చు. ఆ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా వైఫల్యంగా చూపిస్తూ పైఅధికారులకు ఫిర్యాదు చేసి చర్యలకు ఉపక్రమించవచ్చు. తనకే ఎందుకు వరుసగా నైట్‌డ్యూటీలు వేస్తున్నారని ప్రశ్నిస్తే, సిబ్బంది కొరత కాబట్టి తప్పడంలేదని చెప్పొచ్చు. పైఅధికారి తలచుకుంటే ఏదో ఒక కారణం చెప్పి కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకోవచ్చు. 

సస్పెన్షన్లకు లెక్కేలేదు 

  • రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు 10 నుంచి 15 మంది వరకూ ఏదో ఒక కారణంతో కింది స్థాయి సిబ్బంది సస్పెండవుతుంటారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలీసుశాఖలో జరుగుతున్నన్ని సస్పెన్షన్లు మరే ప్రభుత్వశాఖలో ఉండవంటే అతిశయోక్తికాదు. ఇక్కడ అధికారాలు అప్పుడప్పుడూ దుర్వినియోగం అవుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సై శ్రీరాముల శ్రీను తన ఇబ్బందులను సీఐకి విన్నవించుకుంటే ఆయన పరిష్కరించకపోగా.. సూటిపోటి మాటలతో వేధించేవారని, మెమోలు ఇచ్చి ఇబ్బంది పెట్టేవారని ఆయన తన వీడియో వాంగ్మూలంలో పేర్కొన్నారు. 
  • 2016లో సిద్దిపేట జిల్లా కుక్కునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైవేకు ఆనుకొని ఉన్న ఈ స్టేషన్‌కు ఇసుక లారీల ద్వారా పెద్దఎత్తున ఆదాయం వస్తుందని, ఈ మామూళ్ల వసూలు కోసం పైఅధికారులు వేధింపులకు పాల్పడటం వల్లనే రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. 
  • పదవీ విరమణ చేసిన ఒక ఉన్నతాధికారి తన కిందిస్థాయి సిబ్బందికి నరకం చూపించేవారు. ఎక్కువకాలం కేంద్ర సర్వీసులు, నాన్‌ఫోకల్‌ పోస్టులకే పరిమితమైన ఆ అధికారి ఒకసారి తన క్యాంప్‌ క్లర్క్‌ రాసిన లేఖలో తప్పు వచ్చిందన్న కారణంతో చెంపదెబ్బలు కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘నేనయితే రెండు దెబ్బలు కొడతా, నువ్వయితే ఐదు దెబ్బలు కొట్టుకో, అది కూడా గట్టిగా శబ్దం వచ్చేలా’ అంటూ హూంకరించడంతో హడలిపోయిన ఆ ఉద్యోగి తనను తాను చెంపదెబ్బలు కొట్టుకొని తర్వాత మూర్ఛపోయారు. 

ఆర్డర్లీ వ్యవస్థదీ ఇదే పరిస్థితి

పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థపై ఎప్పటినుంచో విమర్శలున్నాయి. ముఖ్యంగా 2012లో హైదరాబాద్‌కు చెందిన కానిస్టేబుల్‌ మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గ్వాలియర్‌ సమీపంలోని జైల్‌పుర్‌ గ్రామం వద్ద అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆక్టోపస్‌ విభాగానికి అప్పట్లో అదనపు డీజీగా పనిచేసిన వివేక్‌ దూబే దిల్లీలోని తన ఇంట్లో పనిచేసేందుకు మురళీనాథ్‌ అనే కానిస్టేబుల్‌ను పంపారు. అక్కడేం జరిగిందో తెలియదు కానీ.. కానిస్టేబుల్‌ మధ్యప్రదేశ్‌లో మరణించారు. అయితే అక్కడి సిబ్బంది హుటాహుటిన మురళీనాథ్‌ మృతదేహాన్ని ఖననం చేయడం విమర్శలకు దారితీసింది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఇతర రాష్ట్రాల్లోని తమ ఇళ్లకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆర్డర్లీ వ్యవస్థలో మార్పులు చేయాలని, ఇందుకోసం ప్రత్యేకంగా నియామకాలు చేపట్టాలి తప్ప పోలీసుశాఖ నుంచి తీసుకోకూడదని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపై ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. తర్వాత అంతా మర్చిపోయారు. ఎస్సై శ్రీను ఆత్మహత్య ఉదంతం లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం పోలీసు సిబ్బందిలో వ్యక్తమవుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు