Harish Rao: కిషన్‌రెడ్డివి పచ్చి అబద్ధాలు

కేంద్రమంత్రి హోదాలో ఉండి తెలంగాణపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అడగలేదని,

Updated : 09 Aug 2022 11:53 IST

ఎయిమ్స్‌కు ఏడాదిన్నర క్రితమే స్థలం ఇచ్చాం
వైద్యకళాశాలల కోసం ఎన్నో విజ్ఞప్తులు చేశాం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రమంత్రి హోదాలో ఉండి తెలంగాణపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్న కిషన్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అడగలేదని, బీబీనగర్‌ ఎయిమ్స్‌కు స్థలమివ్వలేదని అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. ఎయిమ్స్‌కు స్థలంతో పాటు భవనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని, వైద్యకళాశాలల మంజూరు కోసం కేంద్రానికి పలు దఫాలు విన్నవించినా ఒక్కటి కూడా మంజూరు చేయనందుకు కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని భాజపా తెలంగాణను చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 157 వైద్య కళాశాలలను మంజూరు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ధాన్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని.. దానికి వత్తాసుగా కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఉప్పుడు బియ్యం ఎవరూ తినరంటూ సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని తెలిపారు. గతంలోనూ తెలంగాణ ప్రజలకు ఎర్రబస్సు తప్ప ఏమీ తెలియదని కిషన్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడారని, ఇప్పుడూ అదే ధోరణితో మాట్లాడుతున్నారని ఆరోపించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ అబద్ధాలు చెబుతుంటే.. తానేం తక్కువ తినలేదనే భావనతో కిషన్‌రెడ్డి అదే పని చేస్తున్నారు. ఇటీవల విలేకరుల సమావేశంలో, ఆ తర్వాత ఆయన ట్విటర్‌లో బీబీనగర్‌ ఎయిమ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వలేదని పేర్కొన్నారు. బీబీనగర్‌లో నిమ్స్‌కు సంబంధించిన స్థలంలో భవనాన్ని నిర్మించి, దానిని కోరితే ఎయిమ్స్‌కు ఇచ్చాం.  ఇలా ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణయే. వైద్యకళాశాలకు స్థలం కావాలంటే గత ఏడాది మేలో 24 ఎకరాల స్థలమిచ్చాం. వైద్యకళాశాలల గురించి తెలంగాణ అధికారులు కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పడం దారుణం. అప్పటి రాష్ట్ర వైద్యమంత్రి లక్ష్మారెడ్డి కేంద్రమంత్రులు నడ్డా, హర్షవర్ధన్‌లను ఎన్నోసార్లు కలిసి వైద్యకళాశాలల గురించి మాట్లాడారు. మూడో దశలో ఇస్తామని హర్షవర్ధన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా అదీ నెరవేరలేదు. అనేక రాష్ట్రాలకు కళాశాలలు ఇచ్చి తెలంగాణపై సవతి ప్రేమ చూపారు. కేంద్రం మొండిచేయి చూపినా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్యను 21కి పెంచారు. మరో 12 కళాశాలల అవసరం ఉంది. వాటిని వెంటనే ఇప్పించాలి. కిషన్‌రెడ్డికి దమ్ముంటే విభజన చట్టం హామీలను అమలు చేయించాలి. బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయించాలి. ఎస్సీ వర్గీకరణ, బీసీల జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. వాటిని ఆమోదింపజేయాలి.

పార్లమెంటులోనూ నిలదీస్తాం  

కిషన్‌రెడ్డి యాసంగి గురించి మాట్లాడకుండా వానాకాలం ధాన్యం సేకరణ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఉప్పుడు బియ్యమే వస్తాయి. అవి కొనబోమని, ముడిబియ్యం కావాలని కిషన్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. శుక్రవారం తెరాస ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే ధర్నాలు ప్రారంభం మాత్రమే. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఇవి కొనసాగిస్తాం. పార్లమెంటులోనూ కేంద్రాన్ని నిలదీస్తాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని