Health checkups: ఊరూరా ఆరోగ్య పరీక్షలు

రాష్ట్రంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. పెద్దలందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది.

Published : 13 Jun 2024 05:40 IST

జీవన శైలి వ్యాధులకు కళ్లెం వేయడమే లక్ష్యం
మొబైల్‌ ల్యాబ్‌ల వినియోగం
ఎన్‌హెచ్‌ఎంతో కలిసి ప్రభుత్వం ముందడుగు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది. పెద్దలందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తోంది. అందుకుగాను పది మొబైల్‌ ల్యాబ్‌లను సిద్ధం చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఈ క్రతువుకు కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనున్నాయి.

గత 20 ఏళ్లలో తెలంగాణలో హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం, మద్యపానం, జంక్‌ఫుడ్స్‌ కారణంగానే దాదాపు 60 శాతం వ్యాధులు వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి ఒక శాతం లోపే మహిళలు ముందస్తు పరీక్షలు చేయించుకుంటున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది వంద శాతం వరకు ఉంటోంది. గ్రామీణ స్థాయి నుంచి ముందస్తు పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆయా వ్యాధులను నిర్ధారించి, సకాలంలో వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి.

ఏయే పరీక్షలంటే..

ఊరూరా తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో 26-70 ఏళ్ల వయసున్న అందరికీ డిజిటల్‌ మామోగ్రామ్, పాప్‌స్మైర్, ఈసీజీ, ఈ2డీ ఏకో ఇతర అన్ని రకాల రక్తపరీక్షలు నిర్వహిస్తారు. అందుకు అనుగుణంగా మొబైల్‌ ల్యాబ్‌లో వైద్యులతోపాటు నర్సులు ఇతర టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. పురుషుల్లోనూ నోటి క్యాన్సర్‌తోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులపై పరీక్షలు నిర్వహించి.. అనుమానిత లక్షణాలుంటే హైదరాబాద్‌ ఎంఎన్‌జే ప్రభుత్వ క్యాన్సర్‌ ఆసుపత్రికి తరలిస్తారు. బయాప్సీ వంటి తదుపరి పరీక్షలతో వ్యాధి ఉందో లేదో నిర్థారిస్తారు. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు బయటపడిన పక్షంలో ఉచితంగా మందులు అందిస్తారు. సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వారిని అనుసంధానం చేసి అక్కడ నుంచి నెలానెలా మందులు తీసుకునేలా ఏర్పాట్లు చేయడం, వృద్ధులు ఇతర కారణాలతో ఆసుపత్రికి రాలేని వారు ఉంటే ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఇంటికే మందులు సరఫరా అయ్యేలా చేయడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటాయని వైద్య వర్గాల సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు