SCCL: సింగరేణి భూగర్భ గనుల్లో నష్టాలు

సింగరేణి భూగర్భ గనుల్లో భారీ నష్టాలు సంస్థను దెబ్బతీస్తున్నాయి. మొత్తం 40 గనులుంటే వాటిలో 22 భూగర్భ(యూజీ) గనుల్లో దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టాలొస్తున్నట్లు తాజా అంచనా.

Published : 13 Jun 2024 05:30 IST

 రూ.3 వేల కోట్లకు పైనే ఉన్నట్లు తాజా అంచనా 

 భూగర్భ గనిలో బొగ్గు తవ్వుతున్న కార్మికులు

ఈనాడు, హైదరాబాద్‌: సింగరేణి భూగర్భ గనుల్లో భారీ నష్టాలు సంస్థను దెబ్బతీస్తున్నాయి. మొత్తం 40 గనులుంటే వాటిలో 22 భూగర్భ(యూజీ) గనుల్లో దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా నష్టాలొస్తున్నట్లు తాజా అంచనా. మొత్తం 40 గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 41,642 కాగా వారిలో భూగర్భ గనుల్లో 23,235 మంది ఉన్నారు. 2022-23లో 22 భూగర్భ గనుల్లో 72 లక్షల టన్నుల బొగ్గు తవ్వితే 2023-24లో 59.31 లక్షల టన్నులే వచ్చినట్లు తాజాగా తేలింది. మిగిలిన 18 ఉపరితల గనుల్లో 18 వేల మంది ఉత్పత్తి 6.42 కోట్ల టన్నులు ఉన్నందున గతేడాది సంస్థ మొత్తమ్మీద నష్టాల్లో మునగకుండా బయటపడింది. భూగర్భ గనిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి సగటున రూ.10 వేలు ఖర్చవుతుంటే సగటు విక్రయ ధర కేవలం రూ.3,200 మాత్రమే ఉంది. భూగర్భ గనుల వారీగా విడివిడిగా చూస్తే ఈ నష్టాలు మరింత భయపెడుతున్నాయి. ఉదాహరణకు మందమర్రి సమీపంలోని కాసిపేట భూగర్భ గనిలో 1,300 మంది పనిచేస్తుంటే టన్ను బొగ్గు సగటు ఉత్పత్తికి రూ.15,217, ఇదే ప్రాంతంలోని శాంతిఖనిలో టన్నుకు రూ.12,870లను సింగరేణి ఖర్చుపెడుతోంది. కానీ కనీసం ఇందులో సగం ధర కూడా బొగ్గు అమ్మితే రాకపోవడం వల్ల భారీ నష్టాలొస్తున్నాయి.

ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించక...

భూగర్భంలోకి పెద్ద యంత్రాలను పంపి బొగ్గు తవ్వే ఆధునిక పరిజ్ఞానాన్ని విదేశాల్లో మాదిరిగా ఇక్కడ ఉపయోగించడం లేదు. ఒక కార్మికుడు రోజులో పనిచేసేది 8 గంటలైతే భూగర్భ గనిలోకి వచ్చి పోవడానికే 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. మిగిలిన 4 గంటల్లో ఉత్పత్తి కూడా అంతంతమాత్రమే. పైగా భూగర్భంలో ఉన్న తీవ్ర వాతావరణం వల్ల ఎక్కువ సేపు పనిచేసి ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేయలేకపోతున్నట్లు కార్మికులు వాపోతున్నారు. అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే భూగర్భ గనుల్లో ఉన్న వేల మంది కార్మికులను ఇతర ప్రాంతాల్లో పనిచేయించుకునేందుకు కూడా సంస్థకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. యూజీ గనుల్లో కొన్నేళ్లుగా నష్టాలు వస్తూనే ఉన్నాయని సింగరేణి అధికారిక కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య చెప్పారు. ఉపరితల గనుల్లో ఉత్పత్తి మరింత పెంచడం ద్వారా భూగర్భ గనుల నష్టాలను తగ్గించుకునేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సింగరేణి సీఎండీ బలరాం ‘ఈనాడు’కు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని