TG News: నేడు 11 జిల్లాలకు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో సోమవారం 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

Published : 08 Jul 2024 03:23 IST

11వ తేదీ వరకు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సూచించింది. మంగళవారం ఈ జిల్లాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలలో 4.5 సెం.మీటర్లు కురిసింది. ఇదే జిల్లా భీంపూర్‌ మండలం అర్లిలో 4.2, కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి)లో 3.6, నిజామాబాద్‌ జిల్లా సిర్కొండ మండలం చిమన్పల్లిలో 3.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. శనివారం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ సమీపంలో బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన ఆవర్తనం అక్కడే కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని