Tirupati: తిరుపతి అతలాకుతలం

ఏపీలో భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు,

Updated : 12 Nov 2021 05:05 IST

తిరుమల రెండు ఘాట్‌రోడ్లూ మూసివేత
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుంభవృష్టి
గ్రామాల మధ్య తెగిపోయిన సంబంధాలు
ముంపులో చెన్నై నగరం

అలిపిరి మెట్ల మార్గంలో ప్రవహిస్తున్న వరదనీరు

ఈనాడు - తిరుపతి, నెల్లూరు, చెన్నై: ఏపీలో భారీ వర్షాలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుధవారం రాత్రి మొదలైన వర్షం గురువారం అర్ధరాత్రి వరకూ తగ్గలేదు. నదులు, కాలువలు, చెరువులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గాలుల తీవ్రత ఎక్కువ కావడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకూ అంతరాయం కలిగింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  తిరుమల ఘాట్‌రోడ్లు రెండింటినీ శుక్రవారం ఉదయం వరకు మూసేశారు. రేణిగుంట విమానాశ్రయం, రుయాసుపత్రి నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో రైల్వే సిగ్నల్‌ వ్యవస్థ దెబ్బతిని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు.

అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణికింది. తూర్పు, పడమర ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. రహదారులపై వృక్షాలు కూలిపడ్డాయి. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. తిరుపతి నగరంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. తిరుపతి విమానాశ్రయానికి రావాల్సిన ఆరు విమానాలు వర్షం కారణంగా నిలిచిపోయాయి. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట వచ్చే ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక తిరిగి హైదరాబాద్‌ వెళ్లింది. భారీ వర్షాల కారణంగా తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళ్లే రెండు ఘాట్‌రోడ్లను మూసేస్తున్నట్లు తితిదే తెలిపింది.  


నెల్లూరు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు

నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో తడలో 10 నుంచి 18 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. నెల్లూరు నగరంలో జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతులో నీరు నిలిచింది. ఇళ్లలోకి నీరు చేరి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


చెన్నైని వీడని భారీ వర్షాలు.. 14 మంది మృతి

మిళనాట చెన్నై సహా ఉత్తర జిల్లాలైన చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌, కాంచీపురాల్లో గురువారం అతి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 14 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. చెన్నై రోడ్లపై ఎటు చూసినా నీళ్లే ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గురువారం సాయంత్రం చెన్నై తీరం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. ఆ సమయంలో 45 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం స్టాలిన్‌ సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


మహిళా ఇన్‌స్పెక్టర్‌ చొరవ భేష్‌

 

ఉదయను భుజంపై మోస్తూ తీసుకెళ్తున్న ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి

చెన్నై నగరం కీళ్‌పాక్కం శ్మశానవాటికలో పనిచేసే ఉదయ ఆరోగ్యం దెబ్బతిని స్పృహ కోల్పోయాడు. ఆయనను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీపీ సత్రం ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి అక్కడికి చేరుకొని.. విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించి ఉదయను తన భుజంపై మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని