phone tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వార్తల్లో సంయమనం పాటించండి

రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వార్తల ప్రచురణ, ప్రసారంలో మీడియా సంయమనం పాటించాలని హైకోర్టు బుధవారం సూచించింది.

Published : 11 Jul 2024 02:48 IST

మీడియాకు హైకోర్టు సూచన
న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యుల వివరాల వెల్లడి సబబు కాదని వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు వార్తల ప్రచురణ, ప్రసారంలో మీడియా సంయమనం పాటించాలని హైకోర్టు బుధవారం సూచించింది. ఇటీవల కొన్ని పత్రికల్లో (ఈనాడు కాదు) న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్‌ నంబర్లను ప్రచురించినట్లు గుర్తించామంది. వారి వివరాలు వెల్లడించడం సబబు కాదంది. ఈ వార్తల కవరేజీలో మీడియా సంయమనం పాటిస్తుందని విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్‌లను ట్యాప్‌ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. కేంద్రం కౌంటర్‌ దాఖలు చేయాల్సి ఉన్నందువల్ల ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని పేర్కొంది. ఈ వార్తల కవరేజీలో మీడియా అప్రమత్తంగా, సంయమనంతో వ్యవహరించాలని సూచిస్తూ విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది.


మూడోసారి ఛార్జిషీట్‌ వెనక్కి

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు బృందానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కేసుకు సంబంధించి బుధవారం అభియోగపత్రాన్ని దాఖలు చేయగా ‘లెటర్‌ ఆఫ్‌ శాంక్షన్‌’ (నిందితులైన అధికారుల విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు) సమర్పించని కారణంగా నాంపల్లి కోర్టు ఛార్జిషీట్‌ను వెనక్కి పంపింది. దీంతో మూడోసారి అభియోగపత్రాన్ని తిప్పి పంపినట్లయింది. జూన్‌ 10న సిట్‌ బృందం తొలిసారిగా ఛార్జిషీట్‌ దాఖలు చేయగా సమగ్రమైన వివరాలు లేవంటూ జూన్‌ 18న న్యాయస్థానం వెనక్కి పంపింది. అదే రోజున మరోసారి ఛార్జిషీట్‌ దాఖలు చేయగా అందులో పేర్కొన్న మెటీరియల్‌ సమర్పించలేదని జూన్‌ 22న రెండోసారి తిరస్కరించింది. ఆ వెంటనే కోర్టు సూచనల మేరకు సిట్‌ బృందం పెన్‌డ్రైవ్, హార్డ్‌డిస్క్, మొబైల్‌ ఫోన్‌ తదితరాలను మూడు బాక్సుల్లో పెట్టి సమర్పించింది. జూన్‌ 25న మూడోసారి ఛార్జిషీట్‌ సమర్పించగా.. ‘లెటర్‌ ఆఫ్‌ శాంక్షన్‌’ ఇవ్వలేదని తాజాగా న్యాయస్థానం తిరస్కరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని