Telangana High Court: టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఉపసంహరించుకోవాలి

ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది.

Published : 19 Jun 2024 06:10 IST

హైకోర్టు స్పష్టీకరణ
సింగిల్‌ జడ్జి వద్ద వివాదం పెండింగ్‌లో ఉండగా ఎలా చేపడతారని ప్రశ్న
పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనపై ఆగ్రహం

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన వివాదం సింగిల్‌ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉండగా.. ఆ ప్రక్రియను ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ రద్దు చేస్తూ.. వెనక్కి పంపిన విషయం తెలిసీ ఎలా చేపడతారని కోర్టుకు హాజరైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేనను నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. టెట్‌కు సంబంధించి రెండు వేర్వేరు ఉత్తర్వులున్నందువల్ల రెండింటినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్‌ జడ్జికి పంపిన విషయం తెలిసీ ప్రక్రియను ఎలా చేపడతారంది. పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ ప్రభుత్వానికి సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి తెలిపింది. 

ఇదీ నేపథ్యం..

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల పదోన్నతుల్లో భాగంగా టెట్‌లో అర్హత సాధించని ఎస్జీటీలకు అవకాశం కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ సుమారు 150 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. టెట్‌తో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని సవాల్‌ చేస్తూ 52 మంది అప్పీలు దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణల ధర్మాసనం ఈ నెల 14న విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది పి.ఎస్‌.రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. టెట్‌ అర్హత లేనివారికి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల పదోన్నతులకు అవకాశం కల్పిస్తే అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు టెట్‌ అర్హత తప్పనిసరని అన్నారు. అయితే, అభ్యర్థులు 1995-98 మధ్య ఎస్జీటీలుగా నియమితులు కాగా.. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ 2010లో వచ్చిందని తెలిపారు. నోటిఫికేషన్‌కు ముందు నియమితులైనవారికి టెట్‌ అవసరం లేదంటూ 2015లో ప్రభుత్వం జీవో  36 జారీ చేసిందన్నారు. ప్రస్తుతం పదోన్నతులు కల్పిస్తున్న సమయంలో 2010కి ముందు నియమితులైనవారికీ ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. మరో పిటిషన్‌లో ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ ప్రకారం పదోన్నతులు చేపట్టాలంటూ మరో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఈ అప్పీలుపై విచారించిన ధర్మాసనం.. వివాదాన్ని తిరిగి సింగిల్‌ జడ్జి వద్దకే పంపింది. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్‌ను, జీవో 36ను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది. 

14న ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయి..

సింగిల్‌ జడ్జి వద్ద వివాదం పెండింగ్‌లో ఉండగా.. పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ప్రభుత్వ న్యాయవాది మంగళవారం ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ.. ఇక్కడ అప్పీలు వేసినట్లు ప్రభుత్వానికి తెలియదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి కాపీలు అందజేయలేదని చెప్పారు. తనకు కొంత సమయం ఇస్తే కోర్టుకు వచ్చిన అధికారులను వివరణ అడిగి చెబుతానన్నారు. దీంతో సంబంధిత అధికారిని పిలవాలని ధర్మాసనం ఆదేశించగా.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన హాజరయ్యారు. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే ప్రక్రియ మొదలుపెట్టామని, ఇందులో టెట్‌ అర్హత లేనివారినీ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వెనక్కి పంపిన విషయం తెలిసీ ప్రక్రియను ఎలా చేపడతారని నిలదీసింది. ఇది కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ నెల 14న ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. తాజాగా ఎలాంటి ఆదేశాలివ్వలేమంటూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని