Hijab Row: సమస్యను దేశవ్యాప్తం చేయొద్దు

దేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్‌ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి విద్యాసంస్థలకు

Updated : 12 Feb 2022 05:37 IST

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తగిన సమయంలోనే విచారణ

ప్రతిపౌరుడి రాజ్యాంగ హక్కుల్ని పరిరక్షిస్తాం

సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టీకరణ

దిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్‌ వివాదంపై తుది తీర్పు వెలువడే వరకూ విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి విద్యాసంస్థలకు రావద్దన్న కర్ణాటక హైకోర్టు ఆదేశాల్లో ప్రస్తుత దశలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుముచిత సమయంలో విచారణ జరుపుతామని శుక్రవారం తెలిపింది. ఈ అంశాన్ని దేశవ్యాప్త సమస్యగా చేయొద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయవాదులకు సూచించింది. కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరమైనవిగా భావించి సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘హైకోర్టు ఈ అంశంపై అత్యవసర విచారణను జరుపుతోంది. అక్కడ వెలువడిన ఉత్తర్వు ఏమిటో ఇంకా తెలియలేదు. కొంత సమయం వేచిచూద్దాం’ అని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్నారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ...‘కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వు వల్ల రాజ్యాంగ అధికరణం 25 ద్వారా పౌరులకు సమకూరిన మత విశ్వాసాల ఆచరణ హక్కుకు భంగం కలుగుతుంది. ఈ ఉత్తర్వు ముస్లింలపైనే కాకుండా ఇతర మతాల వారిపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక సత్వరమే విచారణ జరపండి’ అని విజ్ఞప్తి చేశారు.  కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇంకా అందుబాటు రాలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించినా అందరికీ ఆమోదయోగ్యమేనని సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ పేర్కొనగా.. ‘కర్ణాటకతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో మేం గమనిస్తున్నాం. వస్త్రధారణ అంశాన్ని జాతీయ సమస్యగా మార్చి దిల్లీకి తీసుకురావడం భావ్యమేనా అనే విషయాన్ని మీరు కూడా ఆలోచించండి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయని న్యాయవాది అభిప్రాయపడగా...‘ఏదైనా తప్పు జరిగితే ధర్మాసనం తప్పనిసరిగా ఆ విషయాన్ని పరిశీలిస్తుంది. పౌరుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని