TG News: మానవతతో భూ పరిహారం

తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి.

Published : 11 Jul 2024 03:36 IST

రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి
ఆర్‌ఆర్‌ఆర్‌ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి
జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

రతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి. వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలి. నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి. రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి. నిబంధనల ప్రకారం రైతులకు ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి.

రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారులకోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించగా.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్‌ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామనే భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణకు ఒప్పించాలని సూచించారు. 

ఒప్పంద ప్రక్రియ ప్రారంభించాలి

‘ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి వీలుగా సాధ్యమైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవటానికి అవసరమైన ప్రక్రియ చేపట్టాలి. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర, దక్షిణ భాగాలను వేర్వేరుగా చూడొద్దని, రెండింటికీ కలిపి ఒకే నంబరు కేటాయించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ఇటీవల కోరగా.. సూత్రప్రాయంగా ఆమోదించారు. ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని సీఎం ఆదేశించారు. ఉత్తర భాగానికి భూసేకరణలో ఉన్న ఆటంకాల గురించి ఆయన ప్రశ్నించారు. ‘ఎలైన్‌మెంట్‌ విషయంలో పొరపడి కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించటంతో స్టే ఇచ్చింది’ అని యాదాద్రి-భువనగిరి కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌ పరిధిలో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితిపై రేవంత్‌ ప్రశ్నించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల నుంచి రహదారి నిర్మించాల్సి ఉందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ ‘నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీస్‌ రోడ్లు నిర్మించాలి. రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అండర్‌పాస్‌లు నిర్మించాలి’ అని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ(ప్రాజెక్టు) సభ్యుడు అనిల్‌ చౌధరి తెలిపారు. జాతీయ రహదారుల వెంట పొలాలకు వ్యవసాయ వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా గ్రావెల్‌ రోడ్లు నిర్మించాలన్న ప్రతిపాదన సమావేశంలో వచ్చింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అనిల్‌ చౌధరి చెప్పారు. గ్రావెల్‌ రహదారి నిర్మాణంతో రైతులకు ఉపయోగపడటంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకూ ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

అటవీశాఖకు భూములు బదలాయించాలి...

‘అటవీ భూముల మీదుగా జాతీయ రహదారులు నిర్మించాల్సి వచ్చిన సందర్భాల్లో ఆ శాఖకు ప్రత్యామ్నాయ భూములను బదలాయించిన తర్వాతే పనులు చేపట్టాలి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల, నాగ్‌పుర్‌-విజయవాడ కారిడార్‌ రహదారులకు అటవీశాఖ కోల్పోయే భూములకు ప్రత్యామ్నాయ భూములను గుర్తించాలి’ అని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌-మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఆయన చేసిన సూచనకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సానుకూలంగా స్పందించారు. ‘హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి ఆరు వరుసల విస్తరణ పనులకు భూసేకరణ పూర్తయినందువల్ల రెండు నెలల్లో పనులు చేపట్టాలి’ అని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరగా.. అందుకు అనిల్‌ చౌధరి సమ్మతించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు శేషాద్రి, మాణిక్‌రాజ్, చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసిం, మౌలిక వసతుల సలహాదారు శ్రీనివాసరాజు, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి రజాక్, పీసీసీఎఫ్‌ డోబ్రియాల్, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీశ్, మెదక్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్‌ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని