IIT Hyderabad: సెమీకండక్టర్‌ నిపుణుల కర్మాగారం.. ఐఐటీ హైదరాబాద్‌

దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లు వస్తున్న నేపథ్యంలో అవసరమైన నిపుణులను తయారుచేసే పనిని ఐఐటీ హైదరాబాద్‌ భుజానికెత్తుకుంది.

Published : 22 Jun 2024 06:46 IST

వందల మందిని తీర్చిదిద్దే పనిలో నిమగ్నం
620 మందికి శిక్షణ ప్రారంభం
ప్రతి 3 నెలలకో బ్యాచ్‌
రెండు మూడేళ్లలో దేశంలో పెద్దఎత్తున సెమీకండక్టర్‌ ప్లాంట్లు

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లు వస్తున్న నేపథ్యంలో అవసరమైన నిపుణులను తయారుచేసే పనిని ఐఐటీ హైదరాబాద్‌ భుజానికెత్తుకుంది. ప్రస్తుతం చైనా, తైవాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి సెమీకండక్టర్లను, వాటి సాంకేతికతను దిగుమతి చేసుకుంటున్న భారత్‌ త్వరలో ఈ రంగంలో స్వయంసమృద్ధిని సాధించే లక్ష్యంతో ముందుకు కదులుతోంది. అది సాకారం కావాలంటే నిపుణులైన మానవ వనరులు కీలకం. ఈ మేరకు వచ్చే రెండేళ్లలో వందల మంది నిపుణులను అందించే పనిలో ఐఐటీ హైదరాబాద్‌ నిమగ్నమైంది. ప్రతి మూడు నెలలకు 200 మందిని తీర్చిదిద్దేందుకు సంకల్పించింది. తొలిసారిగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 620 మందితో కూడిన విద్యార్థుల బ్యాచ్‌కు శిక్షణను తాజాగా ప్రారంభించింది. 

ఎలక్ట్రానిక్‌ వస్తువులు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, టీవీలు, కార్లు, ఇతర వాహనాల తయారీ తదితర ఎన్నో రంగాల్లో సెమీకండక్టర్ల చిప్స్‌ను వాడతారు. ఆయా పరికరాల్లో అవి మెదడు మాదిరిగా పనిచేస్తాయి. వాటిని సొంతంగా తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం సెమీకండక్టర్స్‌ మిషన్‌ను ప్రారంభించి రాయితీలు కూడా ప్రకటించింది. 4 నెలల క్రితం గుజరాత్‌లో 2, అస్సాంలో 1 సెమీకండక్టర్స్‌ తయారీ ప్లాంట్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అందులో రెండు ప్లాంట్లను టాటా సంస్థ చేపట్టింది. 2025లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ సెమీకండక్టర్ల చిప్స్‌ ఉత్పత్తి జరగనుంది. భారత్‌లో చిప్స్‌ తయారీ చేపడతామని, పెట్టుబడులు పెడతామని ప్రముఖ పరిశ్రమలు దరఖాస్తు చేసుకున్నాయి. ఫలితంగా వచ్చే రెండు మూడేళ్లలో పదుల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

భారీగా నిపుణుల అవసరం..

భారత్‌ 2029 నాటికి సెమీకండక్టర్ల తయారీలో తొలి 5 దేశాల్లో ఒకటిగా మారనుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అది జరగాలంటే పెద్దఎత్తున నిపుణులు అవసరం. ఈ దిశగా ఐఐటీ హైదరాబాద్‌ పెద్దఎత్తున శిక్షణ ప్రారంభించింది. పలు ఇతర ఐఐటీలు సైతం సెమీకండక్టర్ల సాంకేతికతపై దృష్టి సారించి ఆ రంగంలో ఉన్న పరిశ్రమలు, ప్రముఖ వర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకుంటున్నాయి. ‘వచ్చే కొద్ది సంవత్సరాల్లో అమెరికా, ఇతర దేశాల కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి’ అని జేఎన్‌టీయూహెచ్‌ ఈసీఈ విభాగం సీనియర్‌ ఆచార్యురాలు ఎం.ఆశారాణి చెప్పారు.

మూడు దశల్లో శిక్షణ

ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బీటెక్‌ చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ హైదరాబాద్‌ శిక్షణ ప్రారంభించింది. ఈ శిక్షణ మూడు దశల్లో ఇస్తారు. తొలిదశలో వారం పాటు ఆన్‌లైన్‌లో కార్యశాల ఉంటుంది. ఐఐటీ హైదరాబాద్, తైవాన్, అమెరికాకు చెందిన ఆచార్యులు, నిపుణులు ఆయా పాఠ్యాంశాలను బోధిస్తారు. రెండోదశలో ఎంపిక చేసిన విద్యార్థులకు మూడు వారాలపాటు ఐఐటీ హైదరాబాద్‌లో శిక్షణ ఇస్తారు. ఇది ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా సెమీకండక్టర్ల తయారీ, సాంకేతికతపై పనిచేస్తూ నేర్చుకుంటారు. చివరిదశలో 50 మందిని ఎంపికచేసి 25 మంది చొప్పున అమెరికాలోని పర్డ్యు యూనివర్సిటీ, తైవాన్‌లోని ఎన్‌టీహెచ్‌యూ వర్సిటీకి పంపిస్తారు. అక్కడి సెమీకండక్టర్ల ప్రయోగశాలల్లో రెండు వారాలపాటు పనిచేస్తూ నేర్చుకుంటారు. ఇది జులై 22వ తేదీ నుంచి మొదలవుతుంది. ఇలా వచ్చే రెండేళ్లపాటు ప్రతి మూడు నెలలకు ఒక శిక్షణ ప్రారంభమవుతుంది.


భారత్‌ అగ్రగామిగా నిలిచేందుకే..

కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్స్‌ మిషన్‌ను ప్రారంభించింది. సెమీకండక్టర్ల తయారీలో భారత్‌ స్వయంసమృద్ధిని సాధించడమే కాకుండా ఇతర దేశాలకూ ఎగుమతి చేయాలి. ఈ రంగంలో అగ్రగామిగా నిలవాలి. అందుకే ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ (ఐసీ) డిజైన్, తయారీలో నిపుణులను తీర్చిదిద్దేందుకు తొలిసారిగా ఐసీ డిజైన్, తయారీపై దృష్టిని కేంద్రీకరిస్తూ బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ను కూడా ప్రారంభించాం. ఎంటెక్‌లో సెమీకండక్టర్స్‌ డిజైన్‌ కోర్సును తీసుకొచ్చాం. ఐఐటీలో నిపుణులైన ఆచార్యులున్నందున దేశానికి అవసరమైన సెమీకండక్టర్ల నిపుణులను తయారుచేయాలని శిక్షణ మొదలుపెట్టాం.

ఆచార్య బీఎస్‌ మూర్తి, సంచాలకుడు, ఐఐటీ హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని