Kaleswaram: కాళేశ్వరం పంపుహౌస్‌లపైనా విచారణ

కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్‌ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్‌..

Published : 07 Jul 2024 05:00 IST

అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నిర్ణయం
రేపు విచారణకు రావాలంటూ ఇంజినీర్లు, గుత్తేదారులకు పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ కమిషన్‌ పరిధి మరింత విస్తరించనుంది. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి సాంకేతిక అంశాలపై విచారణ చేపట్టిన కమిషన్‌.. ఈ పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి పంపుహౌస్‌లు వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈఎన్సీ (జనరల్‌), ఈఎన్సీ (ఓ అండ్‌ ఎం), రామగుండం సీఈ, కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్‌ సీఈ, క్వాలిటీ కంట్రోల్‌ సీఈతోపాటు పంపుహౌస్‌ల ఎస్‌ఈలు, ఈఈలు సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందించిన ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్సీ- గజ్వేల్‌) హరీరాం విచారణకు హాజరుకావాలని కమిషన్‌ కోరింది. చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (ఈఎన్సీ- జనరల్‌ కార్యాలయం) పి.పద్మావతిని కూడా హాజరవ్వాలని సూచించింది. పంపుహౌస్‌లు నిర్మించిన గుత్తేదారులు సోమవారం హాజరయ్యేలా సమాచారం అందించాలని ప్రొసీడింగ్స్‌ జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద అవసరమైన నీటి పరిమాణం ఎంత, ఆ మేరకు పంపుహౌసుల నుంచి నీటిని ఎత్తిపోయడం, నీటి లభ్యత, బ్యారేజీల డిజైన్లు, ప్లానింగ్, నిర్వహణ తదితర అంశాలపై కమిషన్‌ విచారించనున్నట్లు తెలిసింది. శనివారం నుంచి మలిదశ విచారణ ప్రారంభించిన కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌తో.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం భేటీ అయ్యారు.   

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని దస్త్రాలను రెండు వారాల్లోగా సమర్పించాలని కమిషన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ సంస్థ (ఎన్డీఎస్‌ఏ) నిర్వహించిన విచారణకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని కోరింది. గత నెలలోనే నివేదికలు కోరినా.. ఇప్పటివరకు అందకపోవడంపై ఎన్డీఎస్‌ఏ ఛైర్మన్‌తో కమిషన్‌ మాట్లాడినట్లు సమాచారం. కమిషన్‌ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లను నివేదికలు కోరింది. మూడు బ్యారేజీలపై అధ్యయనం చేస్తున్న పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సంస్థకు కమిషన్‌.. ప్రతినిధిని పంపింది. నివేదిక సమర్పించాలని సూచించింది. 

అఫిడవిట్ల నిశిత పరిశీలన

కమిషన్‌ విచారణకు హాజరైనవారు సమర్పించిన అఫిడవిట్లను కమిషన్‌ కార్యాలయ సిబ్బంది నిశితంగా పరిశీలిస్తున్నారు. అఫిడవిట్లలో పొందుపర్చిన సమాచారంలోని ముఖ్యాంశాలను గుర్తిస్తున్నారు. తదుపరి విచారణ అవసరమైతే నోటీసులు జారీచేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని