Medigadda: మేడిగడ్డలో గొయ్యి పెద్దదే!

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు కింద ఏర్పడిన గొయ్యి భారీగానే ఉన్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది.

Updated : 12 Jun 2024 05:27 IST

పరీక్షల ఆధారంగా విశ్లేషణ

మేడిగడ్డ ఏడో బ్లాక్‌ వద్ద ఏర్పడిన గొయ్యి ఇదే

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు కింద ఏర్పడిన గొయ్యి భారీగానే ఉన్నట్లు నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల నిర్వహించిన జీపీఆర్‌టీ (గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌ టెస్ట్‌), ఈఆర్‌టీటీ (ఎలక్ట్రికల్‌ రెసిస్టివిటీ టోమోగ్రఫీ టెస్ట్‌) ఫలితాల ప్రకారం ఈ అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమస్య తీవ్రత దృష్ట్యా ఈ పరీక్షల ఫలితాలను నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) నిపుణుల బృందానికి పంపనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ వద్ద 2023 అక్టోబరులో కుంగగా... పియర్స్, గేట్లు దెబ్బతిన్నాయి. దీనిపై ఎన్డీఎస్‌ఏ విచారణ జరిపింది. అది మధ్యంతర నివేదిక ఇవ్వడానికి కొద్ది రోజుల ముందు పార్సన్‌ అనే సంస్థతోనూ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు పరీక్షలు చేయించారు. వాటి ఫలితాలను ప్రాజెక్టు ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ సీనియర్‌ ఇంజినీర్లు విశ్లేషించారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... బ్యారేజీ ఎగువ నుంచి దిగువకు భారీ గొయ్యి పడిందన్న నిర్ణయానికి వచ్చారు. అది 20 నుంచి 30 మీటర్ల వరకు వెడల్పు, మూడు నుంచి ఐదు మీటర్ల వరకు లోతు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. బ్యారేజీ రాఫ్ట్‌ 88 మీటర్ల వద్ద ఉండగా, కట్‌ ఆఫ్‌ వాల్‌ 74 మీటర్ల వద్ద ఉంది. బ్యారేజీ ఎగువన రాఫ్ట్‌ కింద 20వ వెంట్‌ వద్ద, దిగువన 17వ వెంట్‌ వద్ద కట్‌ ఆఫ్‌ వాల్‌ దిగువన ఈ గొయ్యి పడినట్లు తేల్చారు. అది పైనుంచి కిందకు నేరుగా కాకుండా క్రాస్‌గా ఏర్పడినట్లు జీపీఆర్‌టీ, ఈఆర్‌టీటీ పరీక్షల్లో గుర్తించారు. మొదట్లోనే గుర్తించి ఉంటే గ్రౌటింగ్, లేదంటే ఇతర పద్ధతుల్లో మూసివేసి ఉండొచ్చని, నీటి నిల్వ ఉండటంతో దీన్ని పట్టించుకోకపోవడంతో క్రమంగా భారీగా విస్తరించినట్లు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా అక్కడున్న ఇసుక, మట్టిని తొలగించిన తర్వాత ఈ గొయ్యి బయటపడింది. దీన్ని తాత్కాలికంగా మూసేసినా, భారీ వరద వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే అంచనా వేయడం కష్టమని, బ్యారేజీ గేట్లన్నీ పూర్తిగా ఎత్తేసినా ఏదైనా కారణంతో మరింత నష్టం వాటిల్లే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని ఎన్డీఎస్‌ఏ పేర్కొన్నట్లు ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు