kaleshwaram project: కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు!

కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగి పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది.

Published : 13 Jun 2024 02:59 IST

 రెండు నెలల పాటు పెంచే అవకాశం
సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌
విచారించాల్సిన వారు మరో 50 మంది

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ గడువును పొడిగించనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ కుంగి పియర్స్, గేట్లు దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీలు సహా పలు సమస్యలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించింది. వంద రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్‌ ఆఖరుకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. అయితే ఎన్నికల కోడ్‌ తదితర కారణాల దృష్ట్యా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యంగా న్యాయమూర్తికి చేరడంతో పని ప్రారంభించడంలో జాప్యం జరిగింది. విచారణ ప్రారంభమైనప్పటి నుంచి ఈ నెలాఖరు వరకు సుమారు 60 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడంతోపాటు బ్యారేజీల ఇంజినీర్లు, గతంలో ఈ పనుల్లో భాగస్వాములై ఉండి పదవీ విరమణ చేసిన వారు, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీవో), ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలు, బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఇప్పటివరకు కమిషన్‌ విచారించింది. సుమారు 50 మందితో వేర్వేరుగా ముఖాముఖి మాట్లాడి పలు ప్రశ్నలు సంధించి వివరాలు సేకరించింది. వారందరినీ వ్యక్తిగతంగా అఫిడవిట్లు దాఖలు చేయమని కోరింది. ఈ నెల 25వరకు గడువు ఇచ్చింది. మరో 50 మందిని ఇంకా విచారించాల్సి ఉన్నట్లు తెలిసింది. అఫిడవిట్లు వచ్చిన తర్వాత వాటిని విశ్లేషించాల్సి ఉంది. వాటన్నిటికి సమయం పట్టే అవకాశం ఉందని, విజిలెన్స్‌ నివేదికతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని ఫైళ్లను పరిశీలించాల్సి ఉన్నందున గడువు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రెండు నెలల పాటు పొడిగించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఆదేశాలు వెలువడతాయని నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.

నిర్మాణ సంస్థలు, డిజైన్స్‌ ఇంజినీర్ల విచారణ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఎల్‌అండ్‌టీ, అఫ్కాన్స్, నవయుగ  ప్రతినిధులు సురేష్‌కుమార్, మల్లికార్జునరావు, రమేష్‌లతో పాటు ఆ సంస్థల నుంచి మరికొందరు, సీడీవో, హైడ్రాలజీ-ఇన్వెస్టిగేషన్‌ విభాగం ఇంజినీర్లు బుధవారం జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఎదుట విచారణకు హాజరయ్యారు. బ్యారేజీలలో లోపాలకు కారణం ఏంటి, ఏ కారణం చేత జరిగిందనుకొంటున్నారు, డిజైన్లలో లోపమా, డిజైన్‌ ప్రకారం నిర్మాణంలో లోపమా, నిర్వహణలోనా అంటూ పలు ప్రశ్నలు సంధించి వివరాలు కోరినట్లు తెలిసింది. షూటింగ్‌ వెలాసిటీ సమస్య, ఇసుక మేట వేయడం, ప్రతి సంవత్సరం ఇసుక తొలగించాల్సి ఉండగా అలా చేయకపోవడం తదితర అంశాల గురించి చర్చించినట్లు సమాచారం. లాంచింగ్‌ ఆప్రాన్‌ విస్తరణ సమస్యకు పరిష్కారం అని కొందరు చెప్పినట్లు తెలిసింది. సీడీవో చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌కుమార్, ఆ విభాగంలోని ఎస్‌ఈలు, ఈఈలు, స్పెషల్‌ డిజైన్‌ ఇంజినీర్లు, హైడ్రాలజీ-ఇన్వెస్టిగేషన్‌ ఇంజినీర్లతో బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక మొదలుకొని డిజైన్ల ఖరారు, డిజైన్లు.. డ్రాయింగుల ప్రకారం పనులు జరిగాయా లేదా, నిర్మాణ సమయంలో ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయా తదితర వివరాలన్నింటిని అడిగినట్లు తెలిసింది.

లోపం ఎక్కడ జరిగిందో తేలుస్తాం: జస్టిస్‌ పీసీ ఘోష్‌

నిర్మాణంలో లోపం ఎక్కడ జరిగింది, ఎవరి కారణంగా జరిగిందన్న విషయాన్ని తేలుస్తామని జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. తాము విచారించిన వారు రికార్డు రూపంలో వివరాలు సమర్పించాక... అందులో ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయని ఉందో తెలుసుకొని.. వారిని కూడా పిలుస్తామని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులను బుధవారం విచారించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు తాము ముందుకెళ్లామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పారు. డిజైన్లు, నిర్వహణ.. అన్ని అంశాల గురించి అడిగా. చెప్పిన అన్ని విషయాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించా’’ అని జస్టిస్‌ ఘోష్‌ చెప్పారు. ‘‘కమిషన్‌కు ఎవరు ఏం చెప్పినా ప్రతీదీ రికార్డు రూపంలో ఉండాలి. ఈ నెలాఖరులోగా అఫిడవిట్‌ రూపంలో ఇవ్వాలని ఆదేశించా. సరైన ఆధారాల కోసమే అఫిడవిట్లు దాఖలు చేయమని చెప్తున్నా. విజిలెన్స్, కాగ్‌ రిపోర్టులు ఉన్నాయి. వారిని కూడా పిలిచి వివరాలు తీసుకొంటాం. తప్పుడు అఫిడవిట్లు సమర్పిస్తే వారిపై చర్యలుంటాయి’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని