Bhatti Vikramarka: కేసీఆర్‌కు న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లుంది

‘‘విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్‌ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్‌ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు.

Published : 17 Jun 2024 02:59 IST

విద్యుత్‌పై అసెంబ్లీలో న్యాయవిచారణ కోరిందే భారాస
ఇప్పుడు కక్షసాధింపు అనేవారిది అవగాహన రాహిత్యమే
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వ్యాఖ్య

బోనకల్లు, న్యూస్‌టుడే: ‘‘విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై జ్యుడిషియల్‌ విచారణకు రాబోమని ఎవరైనా అంటే వారి గురించి న్యాయవ్యవస్థ చూసుకుంటుంది. జస్టిస్‌ నరసింహారెడ్డి అనుభవం కలిగిన వారు. నేను చెప్పిందే వేదం, శాసనం.. విచారణకు హాజరుకాము అని కేసీఆర్‌ అంటున్నారంటే ఆయనకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని భావిస్తున్నాం. విచారణకు ఆదేశించడం వరకే ప్రభుత్వం పని, ఆ తర్వాత మాకు సంబంధం ఉండదు. ఎలా విచారిస్తారు, ఎవరిని పిలుస్తారు అనేది మాకు తెలియదు’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తూటికుంట్లలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విచారణ కమిషన్‌ ముందు హాజరు కానని మాజీ సీఎం కేసీఆర్‌ చెప్తున్నారని విలేకరులు ప్రస్తావించగా భట్టివిక్రమార్క సమాధానమిస్తూ ఎవరు హాజరు కాకపోయినా న్యాయవ్యవస్థ చూసుకుంటుందన్నారు. ఇంకా మాట్లాడుతూ విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని అడిగింది భారాస ఎమ్మెల్యే, విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డే అని చెప్పారు. మా ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్తుకు సంబంధించి వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తూ అసెంబ్లీలో శ్వేత పత్రంపై చర్చ పెట్టామన్నారు. సభలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై న్యాయవిచారణ జరపాలని పదే పదే కోరారని, వెంటనే సభా నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శకత ఉండేందుకు న్యాయవిచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. కక్షసాధింపు ధోరణితో జ్యుడిషియల్‌ విచారణ చేస్తున్నారని ఎవరైనా మాట్లాడితే వారిది అవగాహన రాహిత్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. న్యాయవిచారణ జరగాలని మాజీ మంత్రే కోరగా మరోవైపు ఆ పార్టీ నేతలే కక్షసాధింపు ధోరణి అంటున్నారు.. వారిలో వారికే కక్షసాధింపులు ఉన్నాయేమో ఎవరికి తెలుసు అని ఎద్దేవా చేశారు. ఇందిరాగాంధీ లాంటి మహానేతలే విచారణ కమిషన్ల ముందు హాజరయ్యారని గుర్తుచేశారు. 

విద్యుత్‌ సమస్యలపై గ్రామసభలు..

రాష్ట్రంలో సంపూర్ణ పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీగా ఉండేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు గ్రామసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎవరికి ఏ ప్రాంతంలోనైనా విద్యుత్‌ సమస్య ఎదురైనప్పుడు 1912 నంబర్‌కు ఉచితంగా ఫోన్‌ చేయవచ్చన్నారు. సమావేశంలో ఆయన వెంట పీసీసీ సభ్యుడు పైడిపల్లి కిశోర్‌కుమార్, మధిర నియోజకవర్గ నాయకులు గాలి దుర్గారావు, సూరంశెట్టి కిశోర్, జడ్పీటీసీ సభ్యుడు మోదుగు సుధీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని