Bhadradri Thermal power plant: భద్రాద్రి కరెంటు భారమే!

భద్రాద్రి థర్మల్‌ ప్లాంటులో విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ ప్లాంటు నిర్మాణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌.. విద్యుదుత్పత్తి వ్యయం, బొగ్గు వినియోగంపై సమగ్ర వివరాలను సేకరించింది.

Published : 21 Jun 2024 02:57 IST

అన్ని థర్మల్‌ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం
యూనిట్‌ ఉత్పత్తి వ్యయం రూ.6.03
భూపాలపల్లిలో అది రూ. 4.89 మాత్రమే
కమిషన్‌కు సమాచారమిచ్చిన జెన్‌కో

ఈనాడు, హైదరాబాద్‌: భద్రాద్రి థర్మల్‌ ప్లాంటులో విద్యుదుత్పత్తి వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ ప్లాంటు నిర్మాణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌.. విద్యుదుత్పత్తి వ్యయం, బొగ్గు వినియోగంపై సమగ్ర వివరాలను సేకరించింది. కమిషన్‌కు తెలంగాణ జెన్‌కో అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేశంలోని పలు థర్మల్‌ విద్యుత్కేంద్రాలతో పోలిస్తే భద్రాద్రిలో బొగ్గు వినియోగం, కరెంటు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భద్రాద్రి ప్లాంటులో ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి సగటున రూ.6.03 ఖర్చవుతుందని జెన్‌కో అంచనా. కానీ భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్‌ ప్లాంటులో సగటు ఉత్పత్తి వ్యయం రూ.4.89 మాత్రమే. భూపాలపల్లిలో 500, 600 మెగావాట్ల (మొత్తం 1100 మె.వా.) చొప్పున రెండు ప్లాంట్లున్నాయి. వీటిలో గత ఏడాది (2023-24) 822.44 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తికి 48.14 లక్షల టన్నుల బొగ్గును మండించారు. భద్రాద్రి ప్లాంటు సామర్థ్యం దాదాపు దానికి సమానంగా 1080 మెగావాట్లయినా.. 695.39 కోట్ల యూనిట్ల కరెంటు ఉత్పత్తికే 52.30 లక్షల టన్నుల బొగ్గు వినియోగించారు. కాకతీయ ప్లాంటు కన్నా 20 మెగావాట్లే తక్కువ సామర్థ్యం ఉన్నా.. భద్రాద్రిలో విద్యుదుత్పత్తి మాత్రం 127 కోట్ల యూనిట్లు తగ్గగా.. బొగ్గు మాత్రం 4.16 లక్షల టన్నులు అదనంగా వినియోగమైంది. భద్రాద్రి ప్లాంటులో ఒక యూనిట్‌ విద్యుదుత్పత్తికి సగటున 750 గ్రాముల బొగ్గును మండించాలి. కాకతీయ ప్లాంటులో 590 గ్రాములే సరిపోతుంది. తెలంగాణలోని అన్ని థర్మల్‌ విదుత్కేంద్రాల్లో మండించే మొత్తం బొగ్గు లెక్కను తీసుకున్నా సగటున 640 గ్రాముల బొగ్గును మండిస్తుంటే.. భదాద్రిలో అంతకన్నా 110 గ్రాములు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. దీనివల్లే అక్కడ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.6.03కి చేరింది. ఇంతకన్నా తక్కువ ధరకే ‘భారత ఇంధన ఎక్స్ఛేంజి’ (ఐఈఎక్స్‌)లో కరెంటు లభిస్తోంది. భద్రాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి వ్యయం అధికంగా ఉండటం వల్ల దాన్ని కొంటున్న ‘తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ’ (డిస్కం)లపై ఆర్థికభారం భారీగా పడుతోంది.

నాసిరకం బొగ్గుతో మరింత సమస్య

భద్రాద్రి ప్లాంటుకు నాణ్యత లేని బొగ్గును సరఫరా చేస్తున్నందున పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేయలేకపోతున్నామని తెలంగాణ జెన్‌కో ఇటీవల సింగరేణి సంస్థకు లేఖ రాసింది. ఈ ప్లాంటు పూర్తి సామర్థ్యం 1080 మెగావాట్లలో కనీసం 85 శాతం ఉత్పత్తి జరిగితే సగటు వ్యయం తగ్గి.. రాష్ట్రానికి నిరంతర విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతుంది. బొగ్గు నాణ్యత లేనందున ఉత్పత్తి 70 శాతం వరకు మాత్రమే ఉంటోంది. నిర్వహణ ఖర్చులూ భారీగా పెరుగుతున్నాయి. తరచూ బాయిలర్‌ ట్యూబుల లీకేజీ, ఇతర సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి సాధ్యం కావడం లేదు. ఈ ప్లాంటు ఉన్న మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి గనుల్లో ఉత్పత్తవుతున్న బొగ్గులో బూడిద శాతం అధికంగా ఉంటోంది. సుదూర ప్రాంతాల నుంచి నాణ్యమైన బొగ్గు తెప్పించడానికి ఈ ప్లాంటు వరకూ రైలు మార్గం ఇంకా పూర్తికాలేదు. లారీల్లో రప్పించాలంటే రవాణా ఛార్జీలు తోడై.. ఖర్చు ఇంకా పెరిగిపోతుంది. నాణ్యమైన బొగ్గు రాకపోతే ఈ ప్లాంటు మున్ముందు రాష్ట్ర డిస్కంలకు మరింత ఆర్థికభారంగా మారే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని