Justice Narasimha reddy: మరింత సమాచారం ఇవ్వండి..

భారాస ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోలు, విద్యుత్కేంద్రాల నిర్మాణంపై మరింత వివరణ, సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ మరో లేఖ రాసింది.

Published : 26 Jun 2024 04:14 IST

మీరు వచ్చి వివరణ ఇస్తానంటే ఏర్పాట్లు చేస్తాం
కేసీఆర్‌కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ మరో లేఖ
వారం రోజుల గడువు.. మంగళవారంతో పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ప్రభుత్వ హయాంలో కరెంటు కొనుగోలు, విద్యుత్కేంద్రాల నిర్మాణంపై మరింత వివరణ, సమాచారం ఇవ్వాలని మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ మరో లేఖ రాసింది. కమిషన్‌ కార్యాలయానికి కేసీఆర్‌ ప్రత్యక్షంగా వచ్చి వివరణ ఇవ్వాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని ఈ లేఖలో తెలిపింది. కమిషన్‌ గతంలో రాసిన లేఖకు కేసీఆర్‌ స్పందిస్తూ.. కమిషన్‌ ఏర్పాటే చట్టవిరుద్ధమని, విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ జస్టిస్‌ నరసింహారెడ్డికి ప్రత్యుత్తరం పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కమిషన్‌ కేసీఆర్‌కు పంపిన నోటీసులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. ‘‘ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణానికి కాంట్రాక్టుల అప్పగింతపై విచారణకు ఈ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్ని వివరాలు పరిశీలించాక.. 28 మంది అధికారులు, బాధ్యుల వివరణలు ఇవ్వాలని గత ఏప్రిల్‌ 14న కమిషన్‌ లేఖలు రాసింది. అందరూ సమాధానాలిచ్చారు. వీరిలో కొందరు కమిషన్‌ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ప్రజల నుంచి కూడా సమాచారం, సలహాలు కోరుతూ గత నెల 15న కమిషన్‌ ప్రకటన జారీ చేసింది. దీనికి స్పందించి కె.రఘు, ఎం.కోదండరాం, ఎం.తిమ్మారెడ్డి, ఎం.వేణుగోపాలరావు, టి.సునీల్‌రెడ్డి, ఎస్‌.సూర్యప్రకాష్‌రావులు సమాచారం పంపారు. వీరిలో కె.రఘు, ఎం.కోదండరాం, ఎం.తిమ్మారెడ్డి, ఎం. వేణుగోపాలరావు తదితరులను ప్రత్యక్షంగా హాజరై సమాచారం ఇవ్వాలని కమిషన్‌ కోరగా వచ్చి తెలిపారు. వారు ఇచ్చిన సమాచారాన్ని మీకు ఈ నోటీసుతో కలిపి పంపుతున్నాం. మీ వాదనకు సంబంధించిన ఏ సమాచారమైనా కమిషన్‌కు సమర్పించడానికి అవకాశమిస్తున్నాం. ఇప్పటికే కమిషన్‌కు సమాచారం ఇచ్చిన సాక్షులను మీరు క్రాస్‌ ఎగ్జామిన్‌ (విచారణ) చేయాలనుకుంటే అవకాశం కల్పిస్తాం. ఈ అవకాశాన్ని వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని కోరుతున్నాం’’ అని కమిషన్‌ కేసీఆర్‌కు పంపిన నోటీసులో వివరించింది. ఈ నెల 19వ తేదీతో కమిషన్‌ ఈ నోటీసు పంపగా.. అది ఇచ్చిన వారం రోజుల గడువు మంగళవారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే కమిషన్‌ ఏర్పాటు చట్ట విరుద్ధమని, దీన్ని రద్దుచేయాలని కోరుతూ కేసీఆర్‌ తాజాగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడం గమనార్హం. 

జగదీశ్‌రెడ్డికి కూడా..

ఈ అంశాలపై సమాచారం ఇవ్వాలని భారాస ప్రభుత్వంలో విద్యుత్తు శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి కూడా కమిషన్‌ లేఖ రాసింది. ఇప్పటికే కమిషన్‌కు సమాచారం ఇచ్చినవారిని అవసరమైతే విచారించడానికి కూడా ఆయనకు అవకాశం కల్పిస్తామని కమిషన్‌ జగదీశ్‌రెడ్డికి తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని