Kaleshwaram Project: మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే

మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట చెప్పినట్లు తెలిసింది.

Updated : 16 Jun 2024 07:10 IST

తుమ్మిడిహెట్టి నుంచి ఎత్తిపోతకే మేమంతా మొగ్గు చూపాం
జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణలో వెల్లడించిన నిపుణుల కమిటీ సభ్యులు!
నిర్మాణాలలో సబ్‌ కాంట్రాక్టర్ల పాత్రపై కమిషన్‌ విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట చెప్పినట్లు తెలిసింది. మొదటి ఎలైన్‌మెంట్‌ ప్రకారం పనులు ప్రారంభించి చాలా ఖర్చుచేశారని, మార్చడం వల్ల చేసిన వ్యయం వృథాతోపాటు విద్యుత్తు వినియోగం, పెట్టుబడి పెరుగుతుందని ఈ కారణంగానే పాత ఎలైన్‌మెంట్‌కు తాము మొగ్గు చూపామని వారు కమిషన్‌ ముందు పేర్కొన్నట్లు సమాచారం. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్‌ పీసీ ఘోష్‌ న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట హైదరాబాద్‌లో శనివారం విశ్రాంత ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, చీఫ్‌ ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ నుంచి మధ్యమానేరుకు నీటిని మళ్లించడంపై ఐదుగురు విశ్రాంత ఇంజినీర్లతో గత ప్రభుత్వం కమిటీని నియమించింది. అనంతరాములు, వెంకటరామారావు, దామోదర్‌రెడ్డి, చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో కూడిన ఈ కమిటీ తుమ్మిడిహెట్టి నుంచి నీటిని మళ్లించడానికే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో కమిటీలోని సభ్యులను న్యాయ విచారణ కమిషన్‌ పిలిచింది. అమెరికా వెళ్లిన శ్యాంప్రసాద్‌రెడ్డి మినహా మిగిలిన అందరూ హాజరయ్యారు. తుమ్మిడిహెట్టి నుంచే నీటిని మళ్లించాలని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ నుంచి తీసుకొనేలా ఎందుకు మార్చినట్లు, కారణం ఏమనుకొంటున్నారని కమిటీలోని సభ్యులను జస్టిస్‌ పీసీ ఘోష్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యారేజీలు దెబ్బతినడానికి ప్రధాన కారణం ఏంటని ప్రశ్నించగా, ఇన్వెస్టిగేషన్, డిజైన్, నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని, దాని పర్యవసానమే ఇది అని నిపుణుల కమిటీలోని కొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి సమయం ఇవ్వలేదని వారు పేర్కొన్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉందని కమిటీలోని సభ్యులు పేర్కొనగా, జస్టిస్‌ ఘోష్‌ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్లు సమాచారం. వీరితో సమావేశం ముగిసిన తర్వాత మరో విశ్రాంత ఇంజినీర్‌ సత్తిరెడ్డి తదితరులు వేరుగా కమిషన్‌ను కలిసి తమ అభిప్రాయాలు చెప్పారు.

అఫిడవిట్ల పరిశీలన తర్వాత  తదుపరి కార్యాచరణ..

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో సబ్‌ కాంట్రాక్టర్లు చేసిన పనులపై కమిషన్‌ ఆరా తీస్తోంది. ఏ బ్యారేజీలో ఎన్ని పనులు సబ్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చారు. వారెవరు? పనులు పూర్తి స్థాయిలో, ప్రమాణాల మేరకు చేశారా లేదా? ప్రస్తుతం చోటుచేసుకున్న నష్టంలో వారి పాత్ర ఉందా లేదా అనే కోణంలో కమిషన్‌ విచారణ చేస్తోంది. విచారణకు డీఈ స్థాయి ఇంజినీర్లను కూడా పిలవాలనేదానిపై కసరత్తు చేస్తోంది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక తదుపరి కార్యాచరణ చేపట్టాలని కమిషన్‌ నిర్ణయించింది. బహిరంగ విచారణ చేపట్టనుండగా పలు అంశాలపై ప్రత్యక్ష విచారణ నిర్వహించనున్నట్లు కమిషన్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని