Kaleshwaram project: గత ప్రభుత్వంలోని బాధ్యులకూ పిలుపు!

కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక.. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు, ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు.

Updated : 14 Jun 2024 07:23 IST

సంబంధాలున్న వారికి నోటీసులిచ్చే అవకాశం
త్వరలో కార్యాలయంలో బహిరంగ విచారణ
నిపుణులతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ భేటీ 
ఎక్కువ నీటి నిల్వ వల్లే నష్టాలన్న కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్‌లో దాఖలైన అఫిడవిట్ల పరిశీలన పూర్తయ్యాక.. బ్యారేజీల నిర్మాణాలతో సంబంధాలున్న గత ప్రభుత్వంలోని బాధ్యులకు, ఇతరులకు నోటీసులు జారీ చేయనున్నారు. కమిషన్‌ పరిశీలనలో గుర్తించే అంశాలను బట్టి అవసరమైతే వారిని విచారణకు పిలవనున్నట్లు తెలిసింది. జస్టిస్‌ పినాకీ చంద్ర ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ ప్రస్తుతం సాంకేతికాంశాలపై చేపట్టిన విచారణ కొలిక్కి వచ్చింది. కొద్దిరోజుల్లో ఆర్థికాంశాలపై విచారణ ప్రారంభించనుంది. డిజైన్, ప్లానింగ్, కన్‌స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజినీరింగ్‌ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని కమిషన్‌ రాబట్టింది. నిర్మాణాల్లో నిబంధనల అమలుపై ఏజెన్సీల ప్రతినిధులను విచారించింది. బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలపై పలు వివరాలను నమోదు చేసింది. 

అంచనాలు.. రుణాలు.. వడ్డీరేట్లు.. 

బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్‌ దృష్టి సారించనుంది. దీనిలోభాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీరేట్లపై విచారణ చేపట్టనుంది. పలు బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలుగా తెచ్చిన నిధుల వ్యయం లక్ష్యం మేరకు జరిగిందా లేదా అనే కోణంలోనూ ఆరా తీయనుంది. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు జస్టిస్‌ ఘోష్‌ సిద్ధమవుతున్నారు. 

కమిషన్‌కు అందని విజిలెన్స్‌ నివేదిక

కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి  సూచించినప్పటికీ అది ఇంకా అందకపోవడంపై కమిషన్‌ వర్గాలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. నివేదిక కోసం మరోమారు లేఖ రాయాలని కమిషన్‌ నిర్ణయించినట్లు సమాచారం. ప్రాజెక్టుపై కాగ్‌ సమర్పించిన నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేపట్టిన కమిషన్‌ పలు అంశాలను గుర్తించినట్లు తెలిసింది. అవసరమైతే కాగ్‌ అధికారులను కూడా విచారణకు పిలవనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్కే భవన్‌లోని కమిషన్‌ కార్యాలయం పైన ఉన్న అంతస్తులో బహిరంగ విచారణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని ఈ విచారణలో భాగస్వాములుగా చేయనున్నారు. కొంత మంది       వ్యక్తుల నుంచి, ఇతర రూపాల్లోనూ కమిషన్‌ సమాచారం సేకరిస్తోంది.

విద్యుత్‌ నిపుణుడు కూడా ఉండాలి

మేడిగడ్డను బ్యారేజీగా నిర్మించి డ్యాం మాదిరిగా నీటిని నిల్వ చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమైనట్లు కమిషన్‌కు నిపుణుల కమిటీ వివరించినట్లు తెలిసింది. బ్యారేజీలపై కమిషన్‌ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో జస్టిస్‌ పీసీ ఘోష్‌ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పలు వివరాలను వెల్లడించారు. బ్యారేజీ సామర్థ్యం కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేశారని వివరించినట్లు సమాచారం. కమిటీలో విద్యుత్‌ రంగానికి చెందిన ఒక నిపుణుడు ఉండాలని సభ్యులు సూచించగా.. ఆ మేరకు నియామకానికి కమిషన్‌ సుముఖత వ్యక్తం చేసింది. రెండు వారాల్లో మధ్యంతర నివేదిక, నెల రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని నిపుణుల కమిటీని కమిషన్‌ ఆదేశించింది. 

పారదర్శకంగా విచారణ: జస్టిస్‌ పీసీ ఘోష్‌

కాళేశ్వరంపై న్యాయ విచారణ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ తెలిపారు. ఆయన గురువారం తన కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. త్వరలోనే ఆర్థికాంశాలపై విచారణ ప్రారంభిస్తామన్నారు. ఎవరివద్దనైనా సమాచారం ఉంటే కమిషన్‌కు అందజేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని