KCR: విచారణ నుంచి తప్పుకోండి

‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఘాటుగా లేఖ రాశారు.

Updated : 16 Jun 2024 07:07 IST

మీరు ఆ అర్హతను కోల్పోయారు
నిష్పాక్షికత కనిపించడం లేదు
జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్‌ ఘాటు లేఖ
మీ ముందు ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని వ్యాఖ్య
ఇంగిత జ్ఞానం లేకుండా రేవంత్‌ ప్రభుత్వం కమిషన్‌ను వేసిందని ఆక్షేపణ
రాజకీయ కక్షతో అప్రతిష్ఠపాలు చేయడానికేనని ఆరోపణ
విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోలు అన్నీ సక్రమమేనని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఘాటుగా లేఖ రాశారు. కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి జస్టిస్‌ నరసింహారెడ్డిని తప్పుకోవాలంటూ ఈ లేఖలో పలుమార్లు కేసీఆర్‌ విజ్ఞప్తి చేయడం గమనార్హం. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలు నిర్ణయాలపై ఈ నెల 15లోగా వివరణ ఇవ్వాలని కమిషన్‌ కేసీఆర్‌కు ఇటీవల నోటీసు పంపిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా ఆయన 12 పేజీల్లో ఘాటైన పదజాలంతో కమిషన్‌ ఏర్పాటును, ఛైర్మన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ప్రశ్నిస్తూ లేఖ రాశారు. అందులోని ముఖ్యాంశాలు..

కరెంటు సంక్షోభం ఉన్నందునే..

‘అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ఆనాడు కరెంటు విషయంలో అసాధారణ సంక్షోభంలో ఉన్నందునే భద్రాద్రి విద్యుత్కేంద్రాన్ని సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించాలని నిర్ణయించాం. దేశంలో అప్పటికే 90 శాతం సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించిన ప్లాంట్లే ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే ఈ పరిజ్ఞానంతో ప్లాంటు పెట్టినట్లు.. చేయరాని తప్పు ఏదో చేసినట్లు మీరు మాట్లాడిన తీరు దురుద్దేశాన్ని బయటపెట్టింది. 

మూలధన వ్యయం రూ. 400 కోట్ల తగ్గింపు

సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో రాష్ట్రానికి ఏదో భారీ నష్టం వాటిల్లిందన్నట్లుగా మీరు చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం.. అసమంజసం. కనీస పరిజ్ఞానం ఉన్న వారెవరూ వాటిని అంగీకరించరు. ఈ కారణం చేత కూడా మీరు విచారణ అర్హతను కోల్పోయినందువల్ల ఛైర్మన్‌ పదవి బాధ్యత నుంచి తప్పుకోవాలి. ఈ పరిజ్ఞానంతో నిర్మించడం వల్ల పడే అదనపు బొగ్గు భారంపై నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ (భెల్‌)తో తెలంగాణ జెన్‌కో చర్చించి మూలధన వ్యయంలో రూ.400 కోట్లను తగ్గించింది. ఈ తగ్గింపునకు భెల్‌ అంగీకరించిన తరువాతే.. భద్రాద్రి ప్లాంటు పనులు ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం మా పార్టీ విధానం కనుక.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భెల్‌కు యాదాద్రి, భద్రాద్రి పనులు నామినేషన్‌ పద్ధతిపై ఇచ్చాం. భద్రాద్రి ప్లాంటు నిర్మాణం ముందుగా అనుకున్నట్లు రెండేళ్లలో పూర్తికాకపోవడానికి కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్లు మీరు మాట్లాడారు. భద్రాద్రి నిర్మాణంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన స్టే ఉత్తర్వులను గానీ, కరోనా వల్ల అంతరాయాన్ని గానీ మీరు పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరం. 

ఎలాగైనా తప్పు పట్టాలనే ఆలోచన మీది

నవరత్న కంపెనీల్లో ఒకటైన భెల్‌ను పనికిమాలిన ప్రైవేటు సంస్థ అన్నట్లు, ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడమే తప్పన్నట్లు మీ మాటలున్నాయి. ఆనాటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పు పట్టాలనే మీ ప్రీ డిటర్‌మిన్డ్‌ మైండ్‌సెట్‌ (ముందు నిర్ణయించుకున్న మనస్తత్వం)ని ఇది సూచిస్తోంది. అందువల్ల విచారణ కమిషన్‌ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు. మీరు స్వచ్ఛందంగా వైదొలగాలని కోరుతున్నాను. 

రాజకీయ కక్షతోనే...

నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ పిలుపు మేరకు జూన్‌ 15లోగా నా అభిప్రాయాలను సమర్పించాలని అనుకున్నాను. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల మధ్య వివాదం తలెత్తినప్పుడు మధ్యవర్తిగా నిలిచి అసలు నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాలి. మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పడానికి చింతిస్తున్నాను. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు, ఇక ఆ తప్పు వల్ల ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైన మీ తీరు.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు. 

అభినందించాల్సిందిపోయి విమర్శలా?

చర్చోపచర్చల అనంతరం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తొలుత 1000 మెగావాట్లు, అనంతరం అవసరమైతే మరో 1000 మెగావాట్ల కరెంటు ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. 2014 నవంబరు 3న రాయ్‌పుర్‌లో జరిగిన సమావేశంలో 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలుకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాం. కానీ అక్కడి నుంచి కరెంటు సరఫరాకు ట్రాన్స్‌మిషన్‌ లైన్లు లేవు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్‌ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్‌పల్లి వరకూ లైన్‌ నిర్మాణం ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కరెంటు రావాలంటే ప్రత్యేకంగా కారిడార్‌ లైన్‌ అవసరమని ఈ లైన్‌ను ముందుగా బుక్‌ చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ‘అప్‌కమింగ్‌ (రాబోయే) మార్వా ప్రాజెక్టు’ నుంచి కరెంటు సరఫరా చేస్తారని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో చేసుకున్న ఎంఓయూలోనే స్పష్టంగా ఉంది. అయినా మార్వా పవర్‌ ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ కొనుగోలు వ్యవహారాన్ని తప్పుపట్టే విధంగా అది అసలు అప్పటికి లేనేలేదన్నట్లుగా మీరు మీడియాతో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆనాటి మా ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడం దురదృష్టకరం. 

తక్కువ ధరకే కొంటే తప్పు పడతారా?

కరెంటు కొనుగోలును తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ఈఆర్‌సీలు ఆమోదించాయి. కానీ అలా ఆమోదించే అధికారం కేంద్ర ఈఆర్‌సీకే ఉందని, ఇందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మీరు వ్యాఖ్యానించారు. విద్యుత్‌ చట్టం సెక్షన్‌ 64(5) ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ క్రయవిక్రయాలపై నిర్ణయాధికారం కేవలం ఆ రాష్ట్రాల ఈఆర్‌సీలకే ఉంది. చట్టాల్లో ఉన్న ఈ అంశాలను కూడా మీరు పరిగణనలోకి తీసుకోకుండా వ్యాఖ్యలు చేయడం విచారకరం. దీన్నిబట్టి చూస్తే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి విద్యుత్‌ కొనుగోలు వ్యవహారంపై విచారణార్హతను మీరు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. అందుకే మీరు ఆ బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న 2014లోనే.. తమిళనాడు టెండర్‌ విధానంలో యూనిట్‌ రూ.4.94కి, కర్ణాటక రూ.4.33కి కరెంటు కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి యూనిట్‌ రూ.3.90కే తెలంగాణ కోసం మేం కరెంటు కొంటే ఎక్కువ వ్యయం ఎలా అవుతుంది? తెలంగాణ ఎక్కువ ధరను చెల్లించాల్సి వచ్చిందని మీరు ఎలా వ్యాఖ్యానిస్తారు? ఈ దృష్ట్యా కూడా మీరు ఈ వ్యవహారంపై విచారణ జరిపే అర్హతను కోల్పోయారు. స్వచ్ఛందంగా విచారణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 

అవన్నీ గనులకు దూరంగానే ఉన్నాయి..

గనులు దూరంగా ఉన్నందున దామరచర్లకు బొగ్గు రవాణా వ్యయం పెరుగుతుందని అనుకుంటే మరి గతంలో రాయలసీమలోని ముద్దనూరు ప్లాంటును గనులకు దూరంగా 580 కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించారు? తాల్చేరు గనులకు 800 కి.మీ. దూరంలోని విజయవాడలో థర్మల్‌ప్లాంటును ఎందుకు నిర్మించారు? హరియాణా, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఇలాగే గనులకు దూరంగా నిర్మించారు. కరెంటు సరఫరా నష్టాలను తగ్గించడం, పంపిణీ, ఆర్థికాభివృద్ధి వంటి అనేక అంశాలను ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకుని థర్మల్‌ ప్లాంటు నిర్మాణానికి స్థలం ఎంపిక చేస్తారనే వాస్తవాన్ని మీరు విస్మరించడం ఎంతో దురదృష్టకరం. యాదాద్రి ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని మీరు చెప్పడం అసమంజసం. వాస్తవాలకు విరుద్ధంగా పనులు కానే కాలేదన్నట్లుగా దురుద్దేశం ఆపాదించే విధంగా మీరు నిందలు వేశారు. జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ టరమ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో దీని గురించి ప్రస్తావన లేనప్పటికీ మీరు మాట్లాడటం మీ పరిధి దాటి వ్యవహరించడమే కాదు.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి కూడా నిదర్శనం. అందువల్ల విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంతమాత్రం సమంజసం కాదు, స్వచ్ఛందంగా విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కేసీఆర్‌ లేఖలో తెలిపారు. 


ఈఆర్‌సీ ఆమోదంతోనే ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కరెంటు కొనుగోలుపై అప్పటి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) విచారణ సందర్భంగా.. నాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి అభ్యంతరాలు తెలిపారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న తరువాతే ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలుకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. ఈఆర్‌సీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే అప్పుడే విద్యుత్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఆప్టెల్‌)కు, దానిపై సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛను విద్యుత్‌ చట్టం రేవంత్‌రెడ్డికి కల్పించింది. కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి.. గత భారాస ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసి వాటిపై చర్చోపచర్చలు కూడా చేశారు. ఈఆర్‌సీ గతంలో ఇచ్చిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కోల్పోయి మీ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మీరు.. ఈఆర్‌సీ తీర్పులపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా కమిషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తరువాత చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. 


విచక్షణతోనే ‘యాదాద్రి’ స్థల నిర్ణయం

యాదాద్రి ప్లాంటును నల్గొండ జిల్లా దామరచర్లలోనే నిర్మించాలన్న నిర్ణయం, నిర్మాణ స్థలం ఎంపిక రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయాలు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది. అప్పటికి విద్యుత్కేంద్రాలన్నీ ఉత్తర తెలంగాణలో గోదావరి ఒడ్డునే ఉన్నాయి. కానీ దక్షిణ తెలంగాణలో ఏమీ లేవు. విద్యుత్‌ ప్లాంటు నిర్మాణం వల్ల ఒక ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే దామరచర్లను ఎంపిక చేశాం. బొగ్గు కొరత ఏర్పడితే విద్యుత్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. బొగ్గు గనుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతున్న సందర్భాలను ఇటీవల గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా దామరచర్లను ఎంపిక చేశాం. దానికి సమీపంలో కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఓడరేవుల నుంచి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్లాంటు నుంచి పెద్దఎత్తున బూడిద (ఫ్లైయాష్‌) వెలువడుతుంది. దీన్ని వాడుకునే సిమెంటు పరిశ్రమలు దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ బూడిదను వినియోగించుకుంటామని సిమెంటు పరిశ్రమలు లిఖితపూర్వక హామీ కూడా ఇచ్చాయి. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులుపొందిన తరువాతే భద్రాద్రి ప్లాంటును సబ్‌ క్రిటికల్‌ పరిజ్ఞానంతో నిర్మించాం. ఈ సంగతిని మీరు విస్మరించడమే కాకుండా.. అప్పటి మా ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనేలా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు విచారణ అర్హతను కోల్పోయారు. మీ బాధ్యతల నుంచి విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.


యాదాద్రి విద్యుత్‌ ప్లాంటు నిర్మాణ బాధ్యతలు భెల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థకు నామినేషన్‌పై అప్పగించడం చట్టబద్ధమే. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రాల జెన్‌కోలు, చివరికి ప్రైవేటు సంస్థలు కూడా నామినేషన్‌పై భెల్‌కు పనులు అప్పగించిన జాబితాను కూడా మీకు పంపిస్తున్నాను. ఇవేమీ పరిశీలించకుండా ఒక్క తెలంగాణ ప్రభుత్వమే నామినేషన్‌పై పనులు అప్పగించినట్లు మీరు మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని